ఐసీసీ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్లలో వర్తింపు

ICC approves concussion substitutes All Formats - Sakshi

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు ఐసీసీ ఆమోదముద్ర

యాషెస్‌ నుంచే అమలు

మ్యాచ్‌ రిఫరీకే పూర్తి అధికారం

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) క్రికెట్‌లో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు ఆమోదముద్ర వేసింది. వార్షిక సమావేశంలో భాగంగా ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత కేవలం టెస్టుల్లోనే అమలు చేయాలని భావించినా.. మెజారిటీ సభ్యుల విన్నపం మేరకు అన్ని ఫార్మట్లకు వర్తింపచేస్తూ నిబంధనలను రూపొందించింది. దీనిపై పూర్తి అధికారం మ్యాచ్‌ రిఫరీకే ఉంటుందని ఐసీసీ తేల్చిచెప్పింది. 

మ్యాచ్‌ మధ్యలో ఏ జట్టైతే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కోరుతుందో.. ఆ జట్టు డాక్టర్‌ చేత ఆటగాడి గాయానికి సంబంధించిన వివరాలతో కూడిన రిపోర్టును మ్యాచ్‌ రిఫరీకి అందజేయాలి. రిఫరీ ఆమోదం తెలిపాకే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతి లభిస్తుంది. ఇక ఈ విధానం యాషెస్‌ సిరీస్‌ నుంచి ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా దీనిపై సుదీర్ఘ అధ్యయనం చేసి, దేశవాళీ క్రికెట్‌లో అమలు చేసి విజయవంతం అయ్యాకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశపెడుతున్నామని ఐసీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు ఐసీసీ ఆమోదం తెలపడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులు ఆనందం వ్యక్తం చేశాయి.  

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే?
మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే దిమ్మ తిరుగుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్‌ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్‌ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు అంగీకరించరు.  అయితే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశాలు ఉంటాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top