హైదరాబాద్‌కు చావోరేవో 

నేడు ఛత్తీస్‌గఢ్‌తో పోరు

గెలిస్తే క్వార్టర్స్‌కు

విజయ్‌ హజారే ట్రోఫీ   

సాక్షి, హైదరాబాద్‌ : విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ సిద్ధమైంది. బుధవారం జింఖానా మైదానంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగే పోరులో హైదరాబాద్‌ చావోరేవో తేల్చుకోనుంది. గ్రూప్‌ ‘డి’లో ప్రస్తుతం విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లతో కలిసి 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌ క్వార్టర్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఒకవేళ ఓటమి పాలైతే విదర్భ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్‌పై హైదరాబాద్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

విదర్భ విజయం సాధిస్తే టోర్నీలో హైదరాబాద్‌ ద్వారాలు మూసుకుపోతాయి. సౌరాష్ట్ర గెలుపొందితే విదర్భ, సౌరాష్ట్ర, హైదరాబాద్‌ 16 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాయి. అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ కీలకం కానుంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ది కూడా ఇదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే నేరుగా క్వార్టర్స్‌ చేరుతుంది. అందుకే నేడు జరుగుతున్న పోరులో రెండు జట్లు సర్వశక్తులూ ఒడ్డనున్నాయి.  

టోర్నీలో ఇప్పటివరకు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న హైదరాబాద్‌ లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి జోరు మీద ఉంది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ రాయుడు, అక్షత్‌ రెడ్డి జట్టుకు శుభారంభాలు అందించారు. రోహిత్‌ రాయుడు ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలతో మంచి జోరుమీద ఉండగా... అక్షత్‌ రెడ్డి ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. మిడిలార్డర్‌లో బావనక సందీప్, అంబటి రాయుడు, రవితేజ, సుమంత్‌ కొల్లా, ఆకాశ్‌ భండారి మంచి టచ్‌లో ఉన్నారు. బౌలింగ్‌ విషయానికొస్తే మొహమ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు. అతనికి రవికిరణ్, మెహదీ హసన్‌ చక్కటి సహకారం అందిస్తుండగా... ఆకాశ్‌ భండారి స్పిన్‌ బాధ్యతలు మోస్తున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top