జడేజా రియాక్షన్‌.. టైమ్‌ లేదట! | CSKvRCB Jadeja Reaction Goes Viral When Got Kohli | Sakshi
Sakshi News home page

జడేజా రియాక్షన్‌.. టైమ్‌ లేదట!

May 6 2018 9:51 AM | Updated on May 6 2018 5:39 PM

CSKvRCB Jadeja Reaction Goes Viral When Got Kohli - Sakshi

పుణె: విరాట్‌ కోహ్లి లాంటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వికెట్‌ పడగొడితే ఏ బౌలరైనా సరే, మినిమం అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటాడు! కానీ రవీంద్ర జడేజా ఏంది.. కోహ్లిని బౌల్డ్‌ చేశాక ఇచ్చిన విచిత్రమైన రియాక్షన్‌ ఏంటి? క్రీడాభిమానులు, కామెంటేటర్లకు విపరీతంగా నవ్వుపుట్టించిన ఈ వ్యవహారంపై సర్‌ జడేజానే స్వయంగా వివరణ ఇచ్చుకున్నాడు.

ఐపీఎల్‌ 2018లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును 127 పరుగులకే కట్టడి చేసిన  చెన్నై సూపర్‌ కింగ్స్‌.. సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజాకు (4 ఓవర్లలో18 పరుగులిచ్చి 3 వికెట్లు నేలకూల్చిన) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌కు సైతం 2 వికెట్లు దక్కాయి. మ్యాచ్‌ అనంతరం జడేజా కామెంటేటర్లతో చిట్‌చాట్‌ చేశాడు.

ఊహించలేదు.. టైమ్‌ కూడా లేదు!
‘‘దిగ్గజ బ్యాట్స్‌మన్‌ కోహ్లిని అవుట్‌ చెయ్యడం ఏ బౌలర్‌కైనా సంతోషమే. కానీ నా పరిస్థితి అలాలేదు. వేసిన తొలి బంతికే వికెట్‌ దక్కుతుందని ఊహించలేదు. కనీసం సెలబ్రేట్‌ చేసుకోవడానికి టైమ్‌కూడా దొరకలేదు. బంతి గాల్లోకి లేచినా సెలబ్రేషన్‌కు నాక్కొంత సమయం దక్కేది. కానీ వేసిన ఫాస్ట్‌ బాల్‌ నేరుగా వికెట్లను ఢీకొట్టడంతో రియాక్ట్‌ అవ్వడానికి టైమ్‌ లేకుండాపోయింది. తొలి బంతిని పరిశీలించి, పిచ్‌ స్వభావాన్ని అర్థం చేసుకోవడం మంచి బ్యాట్స్‌మన్‌ లక్షణమని నాకు తెలుసు. కానీ, కోహ్లి అలా దొరికిపోతాడని అనుకోలేదు’’ అని వివరించాడు జడేజా.

అంతా మహీభాయ్‌ మహిమ:
మధ్యాహ్నమే భజ్జీతో కలిసి వెళ్లి పిచ్‌ను పరిశీలించానని, డ్రై వికెట్‌ కాబట్టి బంతుల్ని వైవిధ్యంగా విసిరితే ఫలితం రాబట్టొచ్చని అనుకున్నామని జడేజా చెప్పాడు. ‘‘సీజన్‌ ప్రారంభం నుంచి నెట్స్‌లో నేను పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కింది. మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి ఏ ఒక్కరినో బాధ్యులు చేయడం సీఎస్‌కేలో లేదు. గెలిచినా, ఓడినా జట్టు మొత్తానిదీ బాధ్యత అని మహీభాయ్‌(కెప్టెన్‌ ధోనీ) చెబుతుంటాడు. ఆ మాటలు చాలా పనిచేస్తాయి’’ అంటూ జడ్డూ సర్‌ నవ్వేస్తడు. కాగా, జడేజా రియాక్షన్‌పై ఐసీసీతోపాటు నెటిజన్లూ స్పందించారు. ‘ఆఫీస్‌ బాస్‌నే వెళ్లగొడతావా?’ తరహాలో కామెంట్లు పేల్చుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement