‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’

Big Bash League: James Vince Run Out Unluckiest Dismissals - Sakshi

బ్యాట్స్‌మన్‌ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదు.. బౌలర్‌ గొప్పదనమేమి లేదు.. ఫీల్డర్‌ చాకచక్యంగానూ వ్యవహరించలేదు.. కానీ అవతలి ఎండ్‌లో నాన్‌ స్ట్రయికర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌-మెల్‌బోర్న్‌ రెనిగెడ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెల్‌బోర్స్‌ బౌలర్‌ విల్‌ సదర్లాండ్‌ విసిరిన బంతిని సిడ్నీ సిక్సర్స్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ బౌలర్‌ వైపు బలంగా కొట్టాడు. అయితే బ్యాట్స్‌మన్‌ షాట్‌ తప్పి బంతి నేరుగా బౌలర్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆ బంతిని బౌలర్‌ అందుకోవడం విఫలమయ్యాడు. కానీ అనూహ్యంగా బౌలర్‌ జారవిడిచిన ఆ బంతిన నాన్‌స్ట్రయిక్‌లో ఉన్న వికెట్లను ముద్దాడింది. అప్పటికే క్రీజు వదిలి ఉన్న నాన్‌స్ట్రయికర్‌ జేమ్స్‌ విన్సే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అసలేం జరిగిందో తెలియక విన్సేతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే రిప్లైలో క్లియర్‌గా చూశాక జేమ్స్‌ విన్సే భారంగా క్రీజు వదిలివెళ్లాడు. 

ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను బీబీఎల్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’అని ఓ నెటిజన్‌ ఫన్నీ కామెంట్‌ చేయగా.. ‘ఈ బీబీఎల్‌లో విన్సే చుట్టు దురదృష్టం వైఫైలా తిరుగుతోంది’అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ఇక తాజా బీబీఎల్‌ సీజన్‌లో ఈ ఇంగ్లీష్‌ క్రికెటర్‌ విన్సేకు ఏదీ కలసిరావడం లేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విన్సే 25.75 సగటుతో 309 పరుగులు సాధించి నిరుత్సాహపరుస్తున్నాడు. అయితే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో 41 నాటౌట్‌, 51 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్టు కనపడ్డాడు. కాగా, మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేసి సత్తా చాటుతున్న సమయంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

చదవండి:
‘ఇప్పుడే ఐపీఎల్‌లో ఆడటం అవసరమా?’

పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top