వసతి గృహాల్లో వైద్యం ఏదీ..! | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో వైద్యం ఏదీ..!

Published Tue, Mar 5 2019 12:59 PM

Unavailable Medical Facilities In Ongole Social Welfare Hostels - Sakshi

సాక్షి, ఒంగోలు టూటౌన్‌:  సంక్షేమ విద్యార్థులకు వైద్యం కరువైంది. నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయించాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు రోగాల బారిన పడుతుండటంతో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కొక్క వసతి గృహంలో 50 నుంచి 100 మందికి పైగా ఉండటంతో అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువగా గజ్జి, తామర, సీజనల్‌ వ్యాధులైన వైరల్‌ జ్వరాలు ఇలా పలు రోగాల బారిన పడుతూ  ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో నెలకొంది. దీనికి తోడు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత వంటి రోగాల బారిన కూడా ఎక్కువ మంది విద్యార్థులు పడుతుంటారు.  జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులకు నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన ప్రభుత్వ వైద్యాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేద పిల్లలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు వసతి గృహ వార్డెన్ల దృష్టికి తీసుకెళ్లలేక తమలో తామే కుమిలిపోతున్నారు.

జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 89 వరకు ఉన్నాయి. వీటిలో బాలురకు 71, బాలికలకు 18 వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో దాదాపు 9,300 మంది వరకు పేద విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. అయితే వీరికి ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ వైద్యాధికారులు ఎప్పుడు వసతి గృహాలను సందర్శించాలి, ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయాలి, అనారోగ్య బారిన పడిన పిల్లలకు ఎలాంటి వైద్యం అందించాలి అనే అంశాలపై విధి, విధానాలతో సర్క్యులర్‌ జారీ చేస్తోంది. అయితే వసతి గృహాలకు వైద్యాధికారులు వెళ్లిన దాఖలాలే కనిపించడం లేదు. కనీసం ఆయా ప్రభుత్వ ఆరోగ్య సెంటర్ల నుంచి నర్సులను కూడా పంపించే ఆలోచన కూడా చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

నామమాత్రంగా తనిఖీలు..

వసతి గృహాల తనిఖీ సమయంలో కూడా ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై పిల్లలను అడిగిన దాఖలాలు లేవు. తనిఖీల సమయంలో అన్నం సరిగా పెడుతున్నారా.. కోడిగుడ్లు వేస్తున్నారా.. కూరలు బాగున్నాయా..ఇలాంటి ప్రశ్నలు మాత్రమే పిల్లలను అడిగి చేతులు దులుపుకొని రావడం పరిపాటిగా మారింది.  మారుమూల పల్లెల నుంచి వచ్చి సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లలు అన్ని విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఏదైనా గట్టిగా అడిగితే ఇంటికి పంపిస్తారేమోనన్న భయం ఉంటుంది.

తనిఖీకి వచ్చిన అధికారులకు ఇలాంటి విషయాలు చెబితే తరువాత వార్డెన్లు కొడతారేమోననని భయపడుతుంటారు. అందుకని పిల్లలు ఎలాంటి విషయాలు తొందరపడి ఉన్నతాధికారులకు చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితే వెనుకబడిన వసతి గృహాల్లోనూ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో కూడా నెలకొంది. జిల్లాలో వెనుకబడిన వసతి గృహాలు 76 వరకు ఉన్నాయి. వీటిలో బాలురకు 58, బాలికల కోసం 18 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాలు దాదాపు 6,961 మంది వరకు ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో మూడు వసతి గృహాలు, 14 గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలలతో పాటు 17 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు.

కనీస మౌలిక వసతులు కరువు

చాలా వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయలు నేటికీ కల్పించక సతమతమవుతుంటారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కనీసం ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నా చేయకపోవడంపై పలు దళిత, గిరిజన, బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పేద పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కొత్తపట్నంలోని వెనుకబడిన వసతి గృహంలో ఒక విద్యార్థికి అర్ధరాత్రి గుండెపోటు రావడంతో చనిపోయాడని బీసీ సంఘం నాయకులు బంకా చిరంజీవి, వీరభద్రాచారి గుర్తు చేశారు. ఉన్నతాధికారులు వసతి గృహాలను సందర్శిస్తే అసలు నెలనెలా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నది లేనిదీ తేటతెల్లమవుతుందని తెలిపారు.

వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. వసతి గృహాల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయకపోవడంపై సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ యం.లక్ష్మీ సుధ దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించారు. ప్రతి నెలా విద్యార్థులకు ప్రభుత్వ వైద్యాధికారులు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ చాలా వసతి గృహాల్లో నెలనెలా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయడం లేదని తమ దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. దీనిపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి వసతి గృహాల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించేలా చర్యలు చేపడతామన్నారు.

Advertisement
Advertisement