రాజీనామాలకు కలసిరండి!

YSRCP Leaders Slams Chandrababu On Special Status issue - Sakshi

     వైఎస్సార్‌సీపీ పోరాటానికి మేధావులు, విద్యార్థులు బాసటగా నిలవాలి

     బాబుకు చిత్తశుద్ధి ఉంటే హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

     టీడీపీ హయాంలో అత్యధిక హత్యలు

     వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, పార్థసారథి, విష్ణు ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతో కాలయాపన చేయడం తప్పితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామా, ఆ తర్వాత వారు చేపట్టే అమరణ దీక్ష విషయంలోనైనా  టీడీపీ ఎంపీలూ కలిసివచ్చి మూకుమ్మడి రాజీనామాల ద్వారానే కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నేతలు కె. పార్థసారథి, మల్లాది విష్ణులతో కలిసి ఆదివారం బొత్స విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా ఒకేరకమైన పోరాట పంథాను అనుసరిస్తున్న తమ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆఖరి దశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి, ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేయించాలని నిర్ణయించారన్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు మద్దతు, సంఘీభావం తెలపాలని బొత్స విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిన దానికల్లా తలూపుతూ.. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నట్టు ప్రకటించి సన్మానాలు కూడా చేసిన చంద్రబాబు.. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పుడు తానొక్కడే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పోరాడిన వారిపై బనాయించిన కేసులను  ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మా పోరాట పంథానే మా చిత్తశుద్ధి
పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మాట్లాడుతూ అవిశ్వాసం పెట్టడానికి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు ఎంపీలతో రాజీనామా చేయించి అమరణ దీక్షకు నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు.. హోదాపై వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధికి తార్కాణాలన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదని చంద్రబాబు చెబుతున్నారని.. ఆయన కేంద్రానికి ఇచ్చిన వినతిపత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో ప్రధానితోపాటు చంద్రబాబు ముద్దాయేనన్నారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రంతో ఏనాడు మాట్లాడని చంద్రబాబు.. కాంట్రాక్టర్లను మార్చేందుకు మాత్రం నాగ్‌పూర్‌కు 10 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. జనవరి 12న ప్రధానిని కలిసినప్పుడు ప్యాకేజీ గురించే చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. కాగా, వైఎస్‌ జగన్‌పై మంత్రి సోమిరెడ్డి  చేసిన వ్యాఖ్యలను మల్లాది విష్ణు ఖండించారు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ గురించి ఏనాడూ మీడియాతో మాట్లాడలేదని, ఆయనకు జగన్‌ను తిట్టే  శాఖను ఇచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగినన్ని హత్యలు ఎప్పుడూ జరగలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top