వంచనపై ఓటెత్తండి..

YSRCP Leader YS Jagan Mohan Reddy Election Roadshow In Rayadurgam - Sakshi

ఒక్క అవకాశం ఇవ్వండి 

రాయదుర్గం సభలో ఓటర్లకు జగన్‌ అభ్యర్థన 

సాక్షి, అనంతపురం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరోత్సాహంతో ప్రారంభించింది. శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన మరుసటి రోజే ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయదుర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్‌లో రాయదుర్గం వచ్చిన ఆయనకు హెలిప్యాడ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాయదుర్గం వీధుల్లో రోడ్‌షో నిర్వహిస్తూ తేరుబజారుకు చేరుకున్నారు. 12 గంటలకు సభ ఉంటుందని చెప్పడంతో అప్పటికే తేరుబజార్‌ జనంతో కిక్కిరిసిపోయింది.

దాదాపు 3 గంటలు ఆలస్యంగా జగన్‌ రాయదుర్గానికి చేరుకున్నా.. మధ్యాహ్నం వేళ భానుడు ఉగ్రరూపం చూపుతున్నా.. జనం ఒక్క అడుగు కదపలేదు. తమ అభిమాన నేతను చూడాలని, ఎన్నికల ప్రచారసభలో చేసే ప్రసంగాన్ని వినాలని ఎదురు చూశారు. జగన్‌ కన్పించగానే ఈలలు, కేకలతో 5 నిమిషాల పాటు తేరు వీధులను హోరెత్తించారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో మాఫీ చేస్తామని చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడి చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఓటు వేసి వంచనకు గురైన విద్యార్థులు.. రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారి కష్టాలు కళ్లారా చూశాను.. వారి బాధలన్నీ విన్నానన్నారు. ‘‘మీ సమస్యలన్నీ చూశాను, విన్నాను.. మీకు నేనున్నాను.. అని మాట ఇస్తున్నా’ అంటూ భరోసా ఇచ్చారు. జగన్‌ ఈ మాట అనగానే ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని, టీడీపీ నేతలు పెద్ద డ్రామాలు చేస్తారని జగన్‌ జనాన్ని అప్రమత్తం చేశారు.

వారికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఉన్నాయని.. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. ఇన్ని అబద్ధాలు, మోసాలు, అన్యాయాల మధ్య యుద్ధం జరుగుతోంది అని మర్చిపోవద్దన్నారు. ఈ యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతోందని, విశ్వసనీయత, విలువలు ఓవైపు ఉంటే... వంచన మరోవైపు ఉందన్నారు. ప్రజలంతా చల్లని దీవెనలు, ఆశీస్సులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సభ అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ  సర్పంచ్‌లకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సభ తర్వాత వైఎస్సార్‌ జిల్లాలోని రాయచోటి ప్రచారానికి వెళ్లారు. కార్యక్రమంలో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, రాప్తాడు, కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఉషాశ్రీచరణ్, శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మైనార్టీ నేత నదీం అహ్మద్, గౌని ఉపేంద్రారెడ్డి, ముల్లంగి బ్రదర్స్, పలువురు నేతలు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top