80వ రోజు పాదయాత్ర డైరీ

YS Jagan 80th day padayatra dairy - Sakshi

05–02–2018, సోమవారం
అన్నారెడ్డిపాళెం క్రాస్, 
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

ఇలాంటి వాళ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షి ఆలయం వద్ద అర్చకులు, ఆలయ సిబ్బంది నన్ను కలుసుకున్నారు. ‘మీరు అధికారంలోకి రావాలి’అంటూ మనసారా ఆశీర్వదించారు. ఆ క్షణంలోనే వారి కష్టాలు, కన్నీళ్లు నా ముందుంచారు. ‘మీ నాన్నగారి పాలనలో మాకో గౌరవం ఉండేది. ఆనందంగా బతికేవాళ్లం. ఆలయాల్లో వంశపారంపర్య హక్కులు కల్పించి ప్రోత్సహించారు’అని గర్వంగా చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్లే పేద బ్రాహ్మణుల పిల్లలకు ఉన్నత విద్య అబ్బిందన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో అగచాట్లు పడుతున్నట్టు తెలిపారు. ధూప దీప నైవేద్య ఆలయాలను 13 వేల నుంచి 3 వేలకు కుదించారని, బతుకే భారమన్నట్టు బతకులీడుస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని, వంశపారంపర్య హక్కును పునరుద్ధరించాలని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించడం లేదని వాపోయారు. ఆశీర్వదించే ఆ వేద పండితులకే.. చేయి చాచే దయనీయ పరిస్థితి రావడం దారుణం. గుడి భూములే మింగేసే చంద్రబాబు సర్కారులో.. ఇక అర్చకులకు, సిబ్బందికి న్యాయం జరుగుతుందా?

పెనుబోలులో 70 ఏళ్ల గీత కార్మికుడు సుబ్బరామయ్యని చూస్తే జాలేసింది. ఈ వయసులో తాడేసుకుని చెట్టెక్కుతాడట. ఇద్దరు ఆడపిల్లలను బతికించుకోడానికి కాయకష్టం తప్పడం లేదన్నాడు. ఇంతా చేస్తే.. రోజుకు గిట్టుబాటయ్యేది రెండొందల రూపాయలేనట. నాన్నగారి హయాంలో గీత కార్మికులను ఆదరించారని, ఇళ్లు ఇచ్చారని, పిల్లల చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారని, ఆరోగ్యశ్రీ లబ్ధి కలిగించారని, సైకిళ్లు, పనిముట్లు అందించారని గుర్తుచేశాడు. ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని, గీత సొసైటీకి చెల్లించే పన్ను ఈ ప్రభుత్వ హయాంలో రూ.5 వేల నుంచి 35 వేలకు పెరిగిందని చెమ్మగిల్లిన కళ్లతో ఏకరవుపెట్టాడు. కనీసం పింఛన్‌ ఇచ్చినా కాస్తో కూస్తో ఊరటగా ఉంటుందని, ఆ పింఛన్‌ కోసం ప్రయత్నిస్తుంటే జన్మభూమి కమిటీలు మోకాళ్లడ్డుతున్నాయని బాధపడ్డాడు. ఈ వయసులోనూ ఇన్ని బాధలు పడుతున్న ఇలాంటి వాళ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?

పురిటిబిడ్డను, ప్రాణం పోసిన తల్లిని కాపాడే ఏఎన్‌ఎంల సేవలు ఏ పల్లే మరిచిపోదు. నవ్వుతూ కన్పించే వాళ్ల గుండెల్లో ఎంత బాధ ఉందో! జొన్నవాడలో నన్ను కలిసిన ఆ ఏఎన్‌ఎంలు వాళ్ల బతుకు కష్టాలను చెబుతుంటే.. గుండె తరుక్కుపోయింది. రూ.4,000 జీతాన్ని నాన్నగారి హయాంలో రూ.10,000 చేశారట. ఆ తర్వాత వారిని పట్టించుకున్న పాలకుడే లేడట. 24 గంటలూ మాతాశిశు సంరక్షణలోనే ఉన్నా.. వాళ్లకు మాత్రంమాతృత్వపు సెలవులు (మెటర్నిటీ లీవ్స్‌) ఇవ్వరట. రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలకు రూ.40,000 జీతాలు ఇస్తున్నారని, తామూ అంతేపని చేస్తున్నా అందులో నాలుగో వంతే ఇస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని బాధపడ్డారు. వారి సేవలను కూడా కార్పొరేట్‌ సంస్థలకు కాంట్రాక్టుగా ఇచ్చి.. వారి ఉద్యోగాలను ఊడబెరికే ప్రయత్నాలు జరుగుతున్నాయట. వాళ్లందరినీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబే చెప్పారట. ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎంత దుర్మార్గం? ఎంత అన్యాయం?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న. మీ పాలనలో గుడి భూములనే గుటకాయ స్వాహా చేస్తుంటే.. ఇక దేవాలయాలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవైపు దేవాలయాలకు ఆదాయమూ రాక.. మరోవైపు ప్రభుత్వమూ పట్టించుకోకపోతే.. అర్చకులు, ఆలయ సిబ్బంది ఎలా బతకాలి? మీ మేనిఫెస్టోలో గీత కార్మికులకు తాటిచెట్ల పెంపకానికి భూములు కేటాయించడం.. రైతులకు చెల్లించాల్సిన చెట్టు పన్నును ప్రభుత్వమే చెల్లించడం.. తదితర ఏడు హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా?  
- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top