చంద్రబాబు గిమ్మిక్కులు చూసి మోసపోవద్దు

YS Avinash Reddy Election Campaign In YSR Kadapa - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరుటౌన్‌ : చంద్రబాబు గిమ్మిక్కులు చూసి ప్రజలు మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయతీ అమృతానగర్‌లోని వైఎస్‌ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చకుండా మళ్లీ ఎన్నికలు రెండు నెలల్లో వస్తున్నాయని మభ్యపెట్టే పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రెండేళ్ల క్రితమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్‌ను రూ.2వేలు ఇస్తానని ప్రకటించారని,  తాను కూడా రూ.2వేలు ఇస్తానని చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారన్నారు.

2014 ఎన్నికల సందర్భంగా తాను అమృతానగర్‌కు వచ్చానన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ఈ కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆనాడు చెప్పానని, అయితే దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేకపోయామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి తనను, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని పిలిపించి టీడీపీ ప్రభుత్వం అమృతానగర్‌ను అభివృద్ధి చేయకుండా ఎంత నిర్లక్ష్యం చేసిందో వివరించారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు.  

రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తా 
అమృతానగర్‌ను రూ.150 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదెడ్డి పేర్కొన్నారు. ఇది కూడా విడతల వారీగా కాకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నిధుల విడుదల చేసే తొలి సంతకంతో ఈ మొత్తాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు తప్పక నమ్మాలని తెలిపారు. టీడీపీకి ఎందుకు ఓట్లు వేయకూడదో తాను చెబుతానని, చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు.   వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంతటి మోసగాడు ఎవరూ లేరన్నారు. ఓట్ల కోసం ప్రజలను ఎన్నో విధులుగా మభ్యపెడుతున్నారని, వీటన్నింటినీ ప్రజలు గమనించాలన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే జిల్లాతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమృతానగర్‌ ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు తప్ప వేరే పార్టీకి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు.సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top