గెలుపు తీరం చేరుతారా?

Who will going to win those who have changed parties - Sakshi

పార్టీ మారిన వారిలో గెలిచేదెందరో! 

పోటీలో 32 మంది వరకు పార్టీ మారిన వారు.. 

ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురుచూపులు 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీలు మారినా ఆశించిన ఫలితం దక్కుతుందా? ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కోరిక నెరవేరుతుందా? రాజకీయాల్లో ఏళ్ల సీనియారిటీ ఉన్నా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేత లను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలివే.. గతంలో తామున్న పార్టీలు టికెట్లు నిరా కరించినా మరో పార్టీ గుర్తుపై పోటీ చేసినా సొంత చరిష్మాతో గెలుస్తామన్న ధీమాతో వారంతా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మరి కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలు వడనున్న నేపథ్యంలో పోటీ చేసిన ఈ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగింది. పార్టీ మారినా తమకు సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అని తెలుసుకోవాలన్న ఆత్రుత నెలకొంది. పార్టీ మారిన వారి భవితవ్యం ఎలా ఉంటుందా అని ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 32 నియోజక వర్గాల్లో పలువురు అభ్యర్థులు పార్టీలు మారి పోటీలో దిగారు. వారిలో ఎంతమందిని విజయం వరిస్తుందో నేడు తేలనుంది.

మాజీ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు..
పార్టీలు మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. వారిలో జి.వినోద్, ఎ.చంద్రశేఖర్, దానం నాగేందర్, బోడ జనార్దన్‌ ఉండగా, తాజా మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఆర్‌.కృష్ణయ్య, బాబుమోహన్, కొండా సురేఖ పార్టీలు మారి పోటీలో దిగారు. కొండా సురేఖ టీఆర్‌ఎస్‌ తరఫున గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈసారి పరకాలలో పోటీ చేస్తున్నారు. బాబుమోహన్‌ గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అందోల్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్‌.కృష్ణయ్య ఈసారి మిర్యాల గూడలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు.

గెలుపు గుర్రాల పేరుతో..
పార్టీలు మారిన వారికి అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాయి. అందులో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన దానం నాగేందర్‌కు, టీడీపీ నుంచి వచ్చి గొల్ల మల్లయ్యయాదవ్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్లు ఇవ్వగా, టీఆర్‌ఎస్, టీడీపీ, ఎంబీటీ నుంచి వచ్చిన 8 మందికి కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన ఐదుగురికి బీజేపీ టికెట్లు ఇవ్వగా, బీజేపీ నుంచి వచ్చిన పగిడిపాటి దేవయ్యకు టీజేఎస్‌ టికెట్‌ ఇచ్చింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో టికెట్లు లభించకపోవడంతో ఏడుగురు బీఎస్పీ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్‌లో టికెట్లు లభించక మరో నలుగురు బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన మరో ముగ్గురు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీలో దిగగా, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నుంచి మరో ఇద్దరు పోటీలో ఉన్నారు.

గట్టి పోటీ ఇచ్చే నేతలు 20 మందిపైనే..
పార్టీ మారి మరో పార్టీ గుర్తుతో పోటీ లోకి దిగిన అభ్యర్థుల్లో గట్టిపోటీ ఇచ్చే వారు ఎక్కువమంది ఉండగా, వారిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులున్నారు. ఎన్నికల పోలింగ్‌ సరళిని బట్టి కొద్ది మంది మాత్రం పెద్దగా పోటీ ఇవ్వకపోయినా పార్టీలు మారి పోటీ చేస్తున్న 32 మంది అభ్యర్థుల్లో 20 మందికిపైగా గట్టిపోటీ ఇస్తున్న వారే ఉన్నారు. ఓట్లు చీల్చడం ద్వారా కొంతమందికి గెలిచే అవకాశం ఉండగా, మరికొంత మంది ఎదుటి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top