కేంద్రాన్ని అడిగే హామీ ఇచ్చారా?

Uttamkumar Reddy on Muslim reservation - Sakshi

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌కు ఉత్తమ్‌ సూటిప్రశ్న

ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారంటూ నిలదీత

44 నెలలు అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదు..

ముస్లింలను నిలువునా వంచిస్తున్నారని ధ్వజం

మోదీ, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు

చార్మినార్‌ నుంచి గాంధీభవన్‌ వరకు కాంగ్రెస్‌ భారీ ర్యాలీ

పాల్గొన్న ముఖ్య నేతలు కుంతియా, జానారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ :  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ఇచ్చారా అని సీఎం కె.చంద్రశేఖర్‌రావును టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని నిలదీశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో శనివారం చార్మినార్‌ నుంచి గాంధీభవన్‌ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌.సి.కుంతియా, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, పీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జి.నారాయణరెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌లో భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ, నాడు ఓట్ల కోసం 12 శాతం రిజర్వేషన్లు అని గగ్గోలు పెట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్నామనడం సిగ్గుచేటని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 44 నెలలు అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు అమలు చేస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పాలని కేసీఆర్‌ను సవాల్‌ చేశారు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు వస్తాయని నమ్మి టీఆర్‌ఎస్‌కు ఓటేసి, కేసీఆర్‌ను సీఎంను చేసినందుకు ముస్లింలను నిలువునా వంచిస్తున్నారని దుయ్యబట్టారు.  

మోదీ, కేసీఆర్‌ చీకటి ఒప్పందం
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు ప్రధాని మోదీ అంగీకరించరనే విషయం కేసీఆర్‌కు తెలిసినా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ బీజాలు ఉన్న వ్యక్తిని రాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో కూడా కేసీఆర్‌ మద్దతు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో బీజేపీ కుట్రలకు దిగుతున్నదని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారని, ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించామని, రాజ్యాంగపరమైన అవరోధాల్లేకుండా ఉండటానికి 4 శాతాన్ని అమలు చేశామని గుర్తు చేశారు.

ఓట్లు కోసం, అధికారం కోసం కేసీఆర్‌ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని అడిగితే కేంద్రంపై పోరాడుతా అంటూ తప్పించుకునేలా మాట్లాడటం మోసం కాదా అని కుంతియా ప్రశ్నించారు. దేశ సమగ్రత కోసం, మతోన్మాద శక్తులను గద్దె దించడానికి యువత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి దానం, మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top