టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

Uttam Kumar Reddy Will Continue For Some More Time - Sakshi

పీసీసీ చీఫ్‌ మార్పు ఇప్పట్లో లేనట్టే..!

ఈ అంశాన్ని పక్కనపెట్టాలని అధిష్టానం నిర్ణయం

మరికొంత కాలం కొనసాగనున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ముందు వరుసలో రేవంత్, జీవన్‌రెడ్డి పేర్లు, పరిశీలనలో శ్రీధర్‌బాబు పేరు కూడా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష, పార్టీ కార్యవర్గ ప్రక్షాళన రేపోమాపో జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం తెరదించింది! ఈ అంశాన్ని ఇప్పట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధిష్టాన పెద్దలు నిర్ణయించారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే మరికొంతకాలం కొనసాగించాలని, ఆ తర్వాత అవసరం మేరకు మార్పుచేర్పులు చేసుకోవాలనే ఢిల్లీ పెద్దలున్నారని సమాచారం. దీంతో మరో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈ అంశం ప్రస్తావనకు రాకపోవచ్చని, ఒకవేళ ఈ లోపే చేయాలనుకున్నా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యం ఉంటుందని గాంధీ భవన్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

ఇప్పుడేం అవసరం..? 
వాస్తవానికి అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అందరూ భావించారు. అయితే కారణమేదైనా ఆ మార్పు జరగలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉత్తమ్‌నే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తమ్‌ పోటీ చేసి విజయం సాధించడంతో ఆయన సేవలను ఢిల్లీలో వినియోగించుకుంటారని, పార్టీ రాష్ట్ర బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ పేరు దాదాపు ఖరారైందని, నేడోరేపో ప్రకటన కూడా వస్తుందనే స్థాయికి చర్చలు సాగాయి.

కానీ ఆ తర్వాత కూడా పీసీసీ అధ్యక్షుడి మార్పునకు అధిష్టానం మొగ్గు చూపలేదు. ఏఐసీసీ అధ్యక్ష అంశం కొలిక్కి వచ్చాక త్వరలో అసెంబ్లీ ఎన్ని కలు జరగనున్న జార్ఖండ్, హరియాణా రాష్ట్రాలపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టనుంది. ఆ తర్వాత వర్కిం గ్‌ కమిటీ ఏర్పాటు ఉంటుందని సమాచారం. దీనికితోడు హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు కూడా ఉండటంతో ఇప్పట్లో మార్పు అవసరం లేదని, కొంత కాలం వేచి ఉండాల నే నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు సమాచారం.

రెడ్డి సామాజిక వర్గానికే మొగ్గు..!
మార్పు ఎప్పుడు జరిగినా టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేరుతోపాటు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. అయితే రేవంత్‌ సేవలను ఇప్పుడే వినియోగించుకోవాలా లేక ఎన్నికలకు మూడేళ్ల ముందు వరకు ఆగాలా అనే విషయంలో అధిష్టానం కూడా ఏమీ తేల్చుకోలేకపోతోందనే చర్చ జరుగుతోంది. వారిద్దరికీతోడు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరును కూడా పరిశీలిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతోందని, ఆ వర్గానికి కాదంటేనే శ్రీధర్‌బాబుకు అవకాశముంటుందని అంటున్నారు. మొత్తంమీద పీసీసీ అధ్యక్షుడి మార్పు ఎప్పుడు జరిగినా ఈ ముగ్గురిలో ఒకరికి బాధ్యతలు అప్పజెప్తారనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top