గులాబీ పార్టీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై?  | Two TRS MPs Joining In Congress Party | Sakshi
Sakshi News home page

గులాబీ పార్టీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై? 

Nov 15 2018 12:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

Two TRS MPs Joining In Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌.. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరు ఎంపీలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వేశ్వర్‌రెడ్డికి అభ్యంతరాలున్నాయి. తనకు కాకుండా మహేందర్‌రెడ్డికి పార్టీ పెద్దపీట వేస్తుందనే ఆలోచనతో ఆయన ఉన్నారు. దీంతో విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని నెలరోజుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎదురీదుతోందని కొండా పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ఉన్నాయని, అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌కు ఎదురీత తప్పడంలేదని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో తాను చురుకుగా ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. అయితే, ఇటీవల అనారోగ్య కారణాలరీత్యా మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేకపోతున్నట్లు వివరించారు. విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత చల్లా మాధవరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. 

ఫ్రొఫెసర్‌కు కేరళ ‘ఎఫెక్ట్‌’ 
మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ పార్టీ మారేందుకు కేరళ ఎఫెక్టే కారణమని తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీతారాం పోటీ చేసేందుకు వీలు లేకుండా కేరళకు చెందిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోందని ఆయన గుర్రుగా ఉన్నారు. మళ్లీ సీటు ఇచ్చేది లేదనే సంకేతాలను కూడా టీఆర్‌ఎస్‌ ఆయనకు పంపినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మహబూబాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి గతంలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఈసారి మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ లోక్‌సభకు పోటీచేసే అవకాశం కల్పిస్తామన్న భరోసా మేరకు సీతారాం నాయక్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు ఇద్దరు ఎంపీలు అధికార టీఆర్‌ఎస్‌ను వీడటం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఇద్దరి చేరికపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు నిరాకరించారు. తమ పార్టీలోకి వచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు చాలామంది సిద్ధంగా ఉన్నారని, అయితే, ఎప్పుడు వస్తారనేది తాము ఇప్పుడు వెల్లడించలేమని చెప్పారు. అయితే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మాత్రం బుధవారం కొడంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. త్వరలోనే టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారని, దమ్ముంటే వారిని నివారించుకోవాలని కేసీఆర్‌కు సవాల్‌ విసరడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement