
నల్లగొండ టూటౌన్: మతపరమైన రిజర్వేషన్‌లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ పర్యటనకు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ, టీఆర్‌ఎస్ కలసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమన్నారు. మతపరమైన రిజర్వేషన్‌లు కావాలనుకుంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను గెలిపించాలని, వద్దనుకుంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ నల్లగొండ ప్రాజెక్టుల మీద ఎందుకు లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తుందని, రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి కేంద్రమే పనులు చేయిస్తుందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేయడం దేనికని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో ఒక్క పంజాబ్‌లో తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ గెలవలేదన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా సహకరించిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.