హెరిటేజ్‌ కమిటీ ఏమైంది: రేవంత్‌

Revanth Reddy Questions TS Government About Heritage Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పురాతన భవనాల్లో దేన్ని హెరిటేజ్‌ కేటగిరీలో చేర్చాలనే దానిపై హెరిటేజ్‌ కమిటీ వేస్తామని రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సచివాలయం చుట్టూ మూడు కిలోమీటర్ల బందోబస్తు పెట్టి కూల్చాల్సిన అవసరం ఏముందని, కూల్చివేత పనులను వీడియో రికార్డింగ్‌ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సచివాలయం కూల్చివేత పనులు ఆర్కియాలజీ విభాగంతో పాటు ఎన్‌ఎండీసీ నిపుణుల పర్యవేక్షణలో జరిగేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వెంటనే హెరిటేజ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్రాన్ని కలుస్తామని వెల్లడించారు.

జూమ్‌ యాప్‌ ద్వారా తన పార్లమెంటు కార్యాలయం నుంచి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ..సచివాలయ కూల్చివేతకు కోర్టుల నుంచి అనుమతి రాగానే సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లారని ప్రచారం జరుగుతోందని, ఆయన అక్కడికే వెళ్లారా లేక రహస్య ప్రదేశానికి వెళ్లారా అన్నది బ్రహ్మరహస్యమని వ్యాఖ్యానించారు. ఎ–బ్లాక్‌ నుంచి బయటకు సొరంగ మార్గాలున్నాయంటే వాటి కింద గుప్తనిధులున్నాయ నే అనుమానాలున్నాయన్నారు.   శనివారం నిర్వహించిన ‘స్పీకప్‌ తెలంగాణ’లో రేవంత్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని కోరారు. కరోనా చికిత్సనే కాకుండా పరీక్షలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top