పోలింగ్‌ శాతం ఏం చెబుతోంది?

Record Level Polling Was Recorded in Some Locations - Sakshi

తొలిదశలో.. 69.50%  

కొంచెం తేడాతో రెండోదశ..

ముచ్చటగా మూడోదశ?

మరి.. నాలుగోదశలో?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటేసిన వారు ఎంత మంది? అన్న చర్చ ప్రతిసారీ జరిగేదే. వీటికి అనుగుణంగా రాజకీయ పండితులు ఫలానా పార్టీ గెలిచేస్తుందని.. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోనుందని లెక్కలు కట్టేస్తూంటారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఓట్లశాతం భారీగా పెరిగితే అధికార పార్టీకి గండమనే వీళ్లే.. తక్కువ నమోదైనప్పుడు ప్రతిపక్షానికి చేటు అనేస్తారు. ఇందులో నిజమెంత? అబద్ధమెంత?

వాస్తవం ఏమిటంటే.. ఓట్ల శాతానికి అధికార ప్రతిపక్షాల గెలుపు ఓటములకూ మధ్య సంబంధం పిసరంతే. ఇప్పటికే అనేక శాస్త్రీయ అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాలుగోదశతో ఉన్న 543 స్థానాల్లో 373కు పోలింగ్‌ పూర్తయినా.. ఓట్ల శాతం 2014 నాటి స్థాయిలో (66.4)లోనే ఉన్నాయి.  ఏప్రిల్‌ 11న జరిగిన తొలిదశలో గతం కంటే కొంచెం తక్కువ పోలింగ్‌ నమోదు కాగా.. ఏప్రిల్‌ 29 నాటి నాలుగోదశతో మార్పు వచ్చేసింది. మూడో, నాలుగోదశల్లో గుజరాత్, కేరళ, కర్ణాటక, బిహార్‌లోని కొన్ని స్థానాల్లో రికార్డు స్థాయి పోలింగ్‌ నమోదైంది.

ఈ పరిణామాలు తమకు అనుకూలమని అటు ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్షాలు ప్రకటించుకున్నా.. ఇవి అపోహలు మాత్రమే. ఎందుకంటే.. ఈ తర్కాన్ని రెండువైపులా వాడుకోవచ్చు. పోలింగ్‌ శాతం పెరిగితే.. ‘‘ప్రజలు అధికార పక్షంపై అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కసిగా ఓటేశారు’’ అంటారు. అదే తగ్గిందనుకోండి.. ‘‘ప్రతిపక్షాల వద్ద సరైన ప్రణాళిక లేని కారణంగా ప్రజలు ఓటేసేందుకు నిరాసక్తత చూపారు’’ అని అనేస్తారు. 

బీజేపీకి లాభించిన గత ఎన్నికలు.. .
2014 ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో ఓటింగ్‌ శాతం పెరగడం బీజేపీకి బాగా లాభించింది. 1990లో పోలింగ్‌ శాతంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ.. బడుగు, బలహీన వర్గాల వారు పోలింగ్‌లో పాల్గొనడం పెరుగుతూ వచ్చింది. ఇది కాస్తా ప్రజాస్వామ్య ప్రస్థానానికి కారణమైందని యోగేంద్ర యాదవ్‌ లాంటి సెఫాలజిస్టులు అంటారు. 1970 నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించినా దిగువ తరగతుల వారు, మైనార్టీలు, మహిళలు ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఓటింగ్‌లో పాల్గొనడం ఎక్కువవుతూ వచ్చిందని.. దేశ రాజకీయాలపై దీని ప్రభావం ఎక్కువేనని ఆయన విశ్లేషించారు. అంటే గెలుపు ఓటములు పోలింగ్‌ ఎంత జరిగిందన్న అంశంపై కాకుండా ఏఏ వర్గాల వారు ఓటింగ్‌లో పాల్గొన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట.   

అగ్రవర్ణాల వారు ఓటేస్తే....
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరుగుదలకు, బీజేపీ గెలుపునకూ మధ్య సంబంధం స్పష్టంగా కనిపించింది. ఓటింగ్‌ శాతం 15 శాతం కంటే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ 96 శాతం విజయాలు నమోదు చేయగా.. పది నుంచి 15 శాతం పెరుగుదల ఉన్న స్థానాల్లో విజయాల శాతం 86గా ఉంది. పది శాతం కంటే తక్కువగా ఉన్న చోట్ల 46 శాతం, పెద్దగా తేడాల్లేని స్థానాల్లో 34 శాతం సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. 2019 తొలి నాలుగు దశల్లో పోలింగ్‌ గత ఎన్నికల స్థాయిలో పెరగలేదు. 2014లో అగ్రవర్ణాల వారు ఎక్కువగా... పేద, మైనార్టీ వర్గాల వారు తక్కువగా ఓట్లేయడం గమనార్హం. 

సీఎస్‌డీఎస్‌ సర్వే...
ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) జరిపిన ఓ సర్వే సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని ప్రకారం.. మోదీ మద్దతుదారుల్లో కొందరు పాలనపై అసంతృప్తి కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఇంకో లెక్క ప్రకారం.. ఈసారి మైనార్టీలతోపాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు కూడా ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదు. మొత్తమ్మీద తొలి నాలుగుదశల తరువాతి పరిస్థితులను గమనిస్తే.. పరిస్థితి ప్రతిపక్షాలకు కొంత అననుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కార్యకర్తల యంత్రాంగం బలంగా ఉన్న బీజేపీ, డీఎంకే లాంటి పార్టీలు మద్దతుదారులను పోలింగ్‌కు తీసుకురావడం ద్వారా తక్కువ పోలింగ్‌ జరిగే సందర్భాల్లోనూ లాభపడతాయని అంచనా. కార్యకర్తల బలం లేని పార్టీలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తమ్మీద చూస్తే.. ఈసారి ఎవరు ఓటేశారన్నది కాకుండా.. ఏఏ సామాజిక వర్గాల వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్న అంశం బీజేపీ గెలుపు ఓటములను నిర్ణయిస్తుందని అంటున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top