 
													‘నా దారి రహదారి’.. ‘నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’. తాను నటించిన సూపర్‌హిట్ సినిమాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగులు ఇవి. అయితే ఈ డైలాగులు రీల్ లైఫ్‌కే పరిమితమా రియల్ లైఫ్‌లో కూడా రజనీకాంత్‌కు వర్తిస్తాయా అని ప్రజలు, అభిమానులు తర్జన భర్జన పడుతున్నారు. రజనీకాంత్, ఆయన సోదరుడు సత్యనారాయణల నుంచి రాజకీయ ప్రవేశంపై కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు భిన్నమైన ప్రకటనలు వెలువడడమే ఇందుకు కారణం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని భావించేవారికి సినిమారంగం రాజబాట. వెండితెర వేలుపులుగా ఉన్నవారు రాజకీయ వేదికలపై మెరిసిపోయే అవకాశాన్ని అలవోకగా అందుకోవచ్చు. తమిళనాడు అలనాటి ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఇలా అందరూ కోలీవుడ్‌తో సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే. తమిళనాడులోని ప్రముఖ హీరోల తుది టార్గెట్ సీఎం కుర్చీనే అంటే అతిశయోక్తికాదు. నిన్నటి తరం హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, నేటి తరం హీరోలు అజిత్, విజయ్ ఇలా కొందరూ అవకాశం వచ్చినపుడల్లా ఎంతోకొంత రాజకీయ వాసనను ప్రదర్శిస్తుంటారు. హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ అయితే తన కుమారుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ప్రకటించి రంగం సిద్ధం చేశారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎవరు ముందు వస్తారా అని రజనీకాంత్, కమల్‌హాసన్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితమే రజనీకాంత్ ప్రజలకు రాజకీయవాసన చూపించి వెనక్కుతగ్గారు. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది మరలా ప్రజల్లో రాజకీయ ప్రవేశ ఆశలు రేకెత్తించారు. రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని విమర్శించారు, ఈ వ్యవస్థను నేనే మారిస్తే తప్పేంటి అన్నారు. అభిమానులను అక్కున చేర్చుకున్నా, అభిప్రాయాలను సేకరించారు. యుద్ధం వస్తుంది అపుడు రండని సమాయత్తం చేసి పంపివేశారు. అయితే  ఆ మాటల తరువాత రాజకీయాలపై నోరెత్తలేదు. రజనీకాంత్ తన జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రకటన ఖాయమని ఇటీవల ఒక  అభిమాని తెలిపాడు. అభిమాని కాబట్టి అందరూ నమ్మారు. అయితే వారం రోజుల క్రితం విమానాశ్రయంలో ‘రాజకీయాల్లోకి ఇప్పట్లో రావాల్సిన అవసరం లేదు’ అంటూ రజనీకాంత్ మీడియా వద్ద వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో అభిమానులు నిరుత్సాహపడిపోయారు.
జనవరిలో తమ్ముడు

                                         అన్న సత్యనారాయణతో రజనీకాంత్
వస్తాడు : సత్యనారాయణ
తమ్ముడు రజనీకాంత్ తన నిర్ణయాన్ని ప్రకటించి వారం రోజులు కూడా కాలేదు.. ఆయన అన్న సత్యనారాయణ అభిమానుల్లో ఆశలు చిగురింపజేశాడు. కొత్త ఏడాది జనవరి తరువాత నటుడు రజనీకాంత్ రాజకీయ అరగేట్రం ఖాయమని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. ధర్మపురి జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షులు గాం«ధీ ఇంటిలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన  ధర్మపురికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వచ్చేనెల 12వ తేదీన రజనీకాంత్ జన్మదినం రోజున  ఆయన ఎటువంటి ప్రకటన ఆయన చేసే అవకాశం లేదని తెలిపారు. జనవరిలో రెండోదశగా అభిమానులను ఆయన కలుసుకుంటారని చెప్పారు. ఆ తరువాత రాజకీయరంగ ప్రవేశం ఉంటుందని వివరించారు. అన్న మాటలు నమ్మాలా.. తమ్ముడి ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలా.. ఏది నిజం. ‘నా దారి రహదారి’ అంటూ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ అకస్మాత్తుగా రాజకీయాల్లో అడుగుపెడతారా లేక ‘నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’ ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదనే మాటకు నిలబడతారా వేచి చూడాల్సిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
