18న ఎన్నికల నోటిఫికేషన్‌

Rajath Kumar On Election Notification - Sakshi

17 పార్లమెంట్‌ స్థానాలకు వచ్చే నెల 11న పోలింగ్‌

మే 23న కౌంటింగ్, ఫలితాల ప్రకటన

షెడ్యూల్‌ వెలువడిన క్షణం నుంచే అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 11న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఈఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. షెడ్యూల్‌ వచ్చిన మరుక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్‌సైట్‌లు, ప్రభుత్వ సంబంధిత ఆస్తుల పరిధిలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోలను తొలగించాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల్లో ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల ఫొటోలు ఉండరాదన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులు అధికారిక వాహనాలు వాడొద్దని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, అవసరమైన మిషన్లను ఎన్నికల నాటికి అందుబాటులో ఉంచుతామన్నారు. పోలింగ్‌ సమయంలో ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అని, వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసిన కార్డును తీసుకెళ్లొచ్చన్నారు. ఈసారి ఎన్నికల్లో ట్రక్‌ గుర్తును తొలగించినట్లు వెల్లడించారు. ఈసారి తొలిదశ (ఏప్రిల్‌ 11న) పోలింగ్‌ జరిగిన రాష్ట్రాలకు మాత్రం ఫలితాల కోసం ఏకంగా 42 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి.

అభ్యర్థి ప్రచార ఖర్చు రూ.70 లక్షలు...
పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రచార కార్యక్రమానికి గరిష్టంగా రూ.70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చన్నారు. అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు రూ.25 వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చొప్పున డిపాజిట్‌ చేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలకులను నియమిస్తామని, వారి వివరాలను స్థానికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే ఓటరు తుది జాబితా ప్రకటించామని, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి సప్లిమెంట్‌ ఓటరు జాబితాను ప్రకటిస్తామన్నారు. 

ఎన్నికలు జరిగే పార్లమెంట్‌ స్థానాలివే...
రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాలకు ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆదిలాబాద్‌ (ఎస్టీ), పెద్దపల్లి (ఎస్సీ), కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి, వరంగల్‌ (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ), ఖమ్మం పార్లమెంట్‌ స్థానాలున్నాయి.  

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు...
ప్రతి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఈఓ తెలిపారు. ఇది నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికల కోడ్, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1950కి ఫోన్‌ చేసి తెలపొచ్చన్నారు. 040– 23453044, 3038, 3039 ఫోన్‌ నంబర్లకు ఫిర్యాదులను ఫోన్‌ ద్వారా లేదా ఫ్యాక్స్‌ చేయొచ్చని వివరించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు.

షెడ్యూల్‌ ప్రకారమే ఎమ్మెల్సీ ఎన్నికలు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిమిత ఓటర్లతో ఉంటాయని, అయినా ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top