‘బాత్‌ బిహార్‌ కీ’ ప్రారంభిస్తున్నా: ప్రశాంత్‌ కిషోర్‌

Prashant Kishor Announces Baat Bihar ki Program Ahead Bihar Assembly Polls - Sakshi

పట్నా: బిహార్‌ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అందుకే వేలాది మంది యువతతో రాజకీయ శక్తిని తయారుచేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఈ మేరకు ‘బాత్‌ బిహార్‌ కీ’  అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌)పై ప్రశాంత్‌కిషోర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏఏ, ఎన్నార్సీకి మద్దతుగా నిలిచిన జేడీయూ... పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ప్రశాంత్‌ కిషోర్‌ను బహిష్కరించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. నితీశ్‌ నిర్ణయంపై ప్రశాంత్‌ కిషోర్‌ ఎలా స్పందిస్తారో అన్న విషయం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు జనతాదళ్‌ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ప్రశ్నించబోనని స్పష్టం చేశారు. తనకు నితీశ్‌తో సత్సంబంధాలే ఉన్నాయని.. ఆయన మీద అపారమైన గౌరవం కూడా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో.. ‘‘పార్టీ సిద్ధాంతం గురించి నేను, నితీశ్‌ జీతో చాలా చర్చలు జరిపాను. గాంధీజీ ఆశయాలను పార్టీ ఎన్నటికీ వీడదని ఆయన చెప్పారు. కానీ గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా నేడు వారు మాట్లాడుతున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు గాంధీ- గాడ్సే చేతులు పట్టుకుని ఉండరు కదా’’ అని చురకలు అంటించారు.

‘‘నిజానికి ఘట్‌బంధన్‌ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎంతగా తల వంచినప్పటికీ.. పరిస్థితిలో మార్పురావడం లేదు. గత పదిహేనేళ్లుగా నితీశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం చూశాం. కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే. పైగా ఆయన కొత్త స్నేహాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే బిహార్‌ ఇప్పుడు ఎక్కడ ఉంది’’ అని నితీశ్‌ కుమార్‌, బీజేపీ దోస్తీపై విమర్శలు గుప్పించారు.

అదే విధంగా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉంటాను. బిహార్‌ కోసం పనిచేస్తాను. బిహార్‌ అభివృద్ధిని కోరుకునే వారు నాతో కలిసి రావచ్చు. రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి ‘బాత్‌ బిహార్‌ కీ’లో పాల్గొనండి’’ అని పిలుపునిచ్చారు. నితీశ్‌ పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని.. కానీ ప్రస్తుతం ఆయన కొత్త స్నేహాలు ఇందుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాడ్సే సిద్ధాంతాన్ని అవలంభించే వాళ్లతో కలిసి నడవడం తనకు ఇష్టం లేదన్నారు.(ఆరోజే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: ప్రశాంత్‌ కిషోర్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top