టీఆర్‌ఎస్‌ది అధికార దుర్వినియోగం: పొన్నం

Ponnam Prabhakar comments on TRS - Sakshi

     విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు

     ప్రజలను కలవని సీఎంను ఫామ్‌హౌస్‌కు పంపాలి

సిరిసిల్ల: టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆరోపించారు. సిరిసిల్లలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోకపోగా, సదరు అభ్యర్థులకు ఆ సమాచారాన్ని చెబుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికల కమిషన్‌ వెంటనే ఆ మూడు నియోజకవర్గాల్లో ప్రత్యేక సీనియర్‌ అధికారులను నియమించాలని, షాడో బృందాలను వేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు. మహాకూటమిని చూసి టీఆర్‌ఎస్‌ నేతలు వణికిపోతున్నారని, ఏనాడూ ప్రజల వద్దకు రాని మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు సిరిసిల్లలో నిత్యం తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సిరిసిల్లలో ఐదు జోడీల సాంచాలకు ఉచితంగా కరెంటు ఇస్తామని పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో రూ.7 వేల కోట్ల అభివృద్ధి చేశామని చెబుతున్న మంత్రి కేటీఆర్‌.. అందులో రూ.350 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో అధికార పార్టీకి చెందిన ఐదుగురు వ్యాపారులు రూ.కోట్లు సంపాదించారని విమర్శించారు.

పొన్నంకు సన్మానం 
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో తొలిసారి సిరిసిల్లకు వచ్చిన పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను నేతన్నలు కొండ ప్రతాప్, వెంగళ అశోక్‌ నూలు పోగులదండతో సన్మానించారు. గజమాలతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సన్మానం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top