ఇందూరులో ఓటరు పట్టం ఎవరికి?

Political Parties Target to Indhuru Constituency Nizamabad - Sakshi

రివైండ్‌ నిజామాబాద్‌

టీఆర్‌ఎస్‌ నుంచి కవిత ఖరారు.. రెండోసారి మళ్లీ బరిలో..

కాంగ్రెస్‌ నుంచి మధుయాష్కీ..

బీజేపీ అభ్యర్థిగా అరవింద్‌ సిద్ధం

ప్రభావం చూపనున్న ‘పసుపు, జొన్న

నిజామాబాద్‌ లోక్‌సభ.. విలక్షణ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు కంచుకోట. పదిహేడో దఫా ఎన్నికలకు సిద్ధమవుతోంది. గడచిన పదహారు దఫాల్లో ఐదుసార్లు మినహా మిగిలిన విజయాలన్నీ కాంగ్రెస్‌ ఖాతాలోనే జమయ్యాయి. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలవగా, మూడుసార్లు టీడీపీ గెలిచింది. నియోజకవర్గం (1952) ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఇక్కడ ఎక్కువ సార్లు స్థానికేతరులే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఈ స్థానం నుంచి గెలుపొందిన నేతలెవరికీ ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు.

ఖాతా తెరిచిన ‘కారు’
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 2014లో జరిగిన పదహారో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలుపొందారు. ఆమె ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే ఎంపీగా విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కుమార్తె కావడంతో నిజామాబాద్‌ లోక్‌సభవైపు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. గత ఎన్నికల్లో 1.67 లక్షల మెజారిటీతో గెలుపొందిన కవిత, ప్రస్తుతం మరోమారు బరిలో నిలవనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మొత్తంగా 2.17 లక్షల మెజారిటీ సాధించారు. దీంతో ఈ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమా టీఆర్‌ఎస్‌ శిబి రంలో కనిపిస్తోంది. ఈ దిశగా ఈ నెల 13న నిజామాబాద్‌లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మధుయాష్కీ మళ్లీ...
ఒకప్పటి కంచుకోటలో మళ్లీ జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి పావులు కదుపుతోన్న ఆ పార్టీ మధు యాష్కీ పేరునే ఖరారు చేసింది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి విజయం సాధించిన ఆయన, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన మరోసారి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో.. గెలుపు సన్నాహాలుకు ఆ పార్టీ కేడర్‌ సిద్ధమైంది. నిజానికి యాష్కీ.. తమ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపారు. దీంతో ఆయన కాకపోతే ఇక్కడి నుంచి పోటీకి బలమైన మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని పార్టీ యోచించింది.  మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎమ్మెల్యే గంగారామ్‌ పేర్లనూ పరిశీలించింది. అలాగే, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని, అదే జరిగితే ఆయనకు మద్దతునివ్వాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ యోచించింది.  చివరకు మధుయాష్కీ పేరునే అధిష్టానం ఖరారు చేసింది. నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి గెలుపులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డితో పాటు మహేశ్, భూపతిరెడ్డి తదితర నేతల సహకారం కీలకం కానుంది.

కమలారవిందం..
భారతీయ జనతా పార్టీ ఈ దఫా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు గట్టిపోటీనివ్వాలనే యోచనలో ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్‌ క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆయన బీజేపీలో రెండేళ్లుగా లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లు, బూత్‌ స్థాయి బాధ్యులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇటీవల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ పాలన, విదేశీ, రక్షణ వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వ వైఖరి తదితరాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి అరవింద్‌ గెలుపు సంగతెలా ఉన్నా.. ఎవరి ఓట్లను చీలుస్తుందోననే భయం ప్రధాన పార్టీల్లో ఉంది.

రైతుల నామినేషన్లు..
నియోజకవర్గంలో రైతుల ఆందోళన ప్రత్యేకంగా గుర్తిం చాల్సిన అంశం. ఇక్కడ ఎక్కువగా వాణిజ్య పంట లు పండుతాయి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఎర్రజొన్న, పసుపు రైతులు కొంతకాలంగా ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం స్పం దించే వరకు ఆందోళన వీడేది లేదంటూ ఇటీవల జాతీయ రహదారిని దిగ్బంధించారు. దేశం దృష్టిని ఆకర్షించేందుకు లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకోవాలని రైతు సంఘాలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయాలని నిర్ణయించాయి. నామినేషన్లకు అవసరమైన నిధులు సమకూర్చే భారాన్ని గ్రామ సంఘాలపై పెట్టారు. ఇది ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అంచనా. - కల్వల మల్లికార్జున్‌రెడ్డి

గెలుపోటముల విశేషాలు
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చిన హరీష్‌చంద్ర హెడ్డా.. 1930వ దశకంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో భారతీయ జాతీయ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1952లో తొలిసారిగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. 1957, 62 ఎన్నికల్లోనూ గెలుపుతో హ్యాట్రిక్‌ కొట్టారు.
స్థానిక నినాదంతో 1967 ఎన్నికల్లో ఎం.నారాయణరెడ్డి విజయం సాధించారు.
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా ఉన్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన జె.రాంగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున మూడుసార్లు గెలిచారు.
1984, 1989 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన తాండూరు బాలాగౌడ్‌ (కాంగ్రెస్‌).. 1991లో గడ్డం గంగారెడ్డి (టీడీపీ) చేతిలో ఓడిపోయారు.
1996లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నారై గడ్డం ఆత్మచరణ్‌రెడ్డి గెలిచారు.
2004, 2009 ఎన్నికల్లో గెలుపుతో గుర్తింపుపొందిన మధు యాష్కీ (కాంగ్రెస్‌).. 2014 ఎన్నికల్లో కవిత (టీఆర్‌ఎస్‌) చేతిలో ఓడిపోయారు.

ఇందూరు బరిలో విజేతలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top