ఉప్పెనై లేద్దాం.. హోదా సాధిద్దాం

People with Leader Ys Jagan in every step of Prajasankalpayatra - Sakshi

పాదయాత్రలో అడుగడుగునా నినదించిన జనం 

జననేత అడుగులో అడుగేస్తూ సంఘీభావం  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘హోదానే మా ఊపిరి. అది సాధించేందుకు ఉప్పెనై లేస్తాం. ఉద్యమ తరంగాలై కదిలొస్తాం. జగనన్న అడుగులో అడుగేస్తాం’ అంటూ నారా కోడూరు వద్ద యువత పిడికిళ్లు బిగించి నినాదాలు చేసింది. ‘మా నేత పాదయాత్ర చేస్తూ ప్రజల్లో హోదా జ్వాల రగిలించగా.. చంద్రబాబు నేలబారు రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ బుడంపాడు దగ్గర నిప్పులు కక్కే ఎండలో యువకులు నినదించారు.  ‘జగన్‌ స్ఫూర్తి పల్లెలను కదిలిస్తోంది’ అని వేజెండ్ల వద్ద బీటెక్‌ విద్యార్థులు వ్యాఖ్యానించారు.

ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. లెక్కలేనన్ని స్వరాలు.. దిక్కులు పిక్కటిల్లేలా హోదా నినాదాలు చేశాయి. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలన్న ప్రతిపక్ష నేత జగన్‌ పిలుపు బుధవారం ప్రజాసంకల్ప యాత్రను మరింత వేడెక్కించింది. 128వ రోజు పాదయాత్ర గుంటూరు శివారు మొదలుకొని బుడంపాడు, నారాకోడూరు వేజెండ్ల వరకూ సాగింది. దారిపొడవునా మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వృద్ధులు భారీగా జననేత అడుగులో అడుగులేశారు. భావోద్వేగంతో మనోభావాలు పంచుకున్నారు. జగన్‌ వద్దకు వచ్చిన జనాల్లో తాజా రాజకీయ పరిణామాలపై పరిపక్వత స్పష్టంగా కనిపించింది. ఢిల్లీని వణికించి.. హోదా తెచ్చే జగన్‌ సచ్ఛీల రాజకీయాలను ప్రజలు కొనియాడటం పాదయాత్ర ప్రతీ మలుపులోనూ కనిపించడం విశేషం. రణ నినాదమై రాజుకుంటున్న హోదా సెగల్లోనూ తాడిత, పీడిత జనావళి హృదయ ఘోషను జగన్‌ ఓపికగా విన్నారు. సర్కారు తీరుతో కష్టపడిన, నష్టపోయిన వారిని ఓదార్చారు. త్వరలోనే మంచి రోజులొస్తాయని ధైర్యం చెప్పారు.

యువజనం.. మహిళా ప్రభంజనం..
ప్రజా సంకల్ప యాత్రకు బుధవారం యువజనం పోటెత్తారు. మరో పక్క మహిళా ప్రభంజనం తోడైంది. యువతీ యువకులు ప్రధానంగా ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని, హోదా నినాదాలు రాసిన టీ షర్డులు వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎర్రటి ఎండలో అభిమాన నేత కోసం గంటల కొద్దీ వేచి చూశారు. జగన్‌ను కలిసే క్షణంలో భావోద్వేగంతో ఊగిపోయారు. ‘ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది. జగన్‌ అన్న ఉద్యమ సారథిగా ఉంటే ఏదైనా సాధిస్తాం’ అని జననేతను కలిసిన భాస్కర్, అనుపమ, నీరజ్, సుకుమార్‌లు అన్నారు. సంధ్య, మాళవిక, పల్లవి, రుక్ష్మిణి హోదాకు మద్దతిచ్చేందుకు వేజెండ్లకు వచ్చారు. క్యూకట్టి జననేత వద్దకు వెళ్లి వారి మనోభావం వెలిబుచ్చారు. ఫొటోలు దిగారు. ఆ తర్వాత వాళ్లల్లో ఆవేశం కనిపించింది. ‘చంద్రబాబు మోసం చేశారు.. హోదాను తాకట్టు పెట్టారు. మళ్లీ డ్రామాలాడుతున్నారని అన్నకు చెప్పాం’ అని పల్లవి ఆవేశంగా తెలిపింది. ఆ క్షణంలో మిగతా యువతులు ‘జై జగన్‌’ అంటూ నినదించారు. గుంటూరు శివారులో ఆరు చోట్ల యువతీయువకులు ప్రత్యేక హోదా నినాదాన్ని జగన్‌ వద్ద వినిపించేందుకు వచ్చారు. అడుగడుగునా మహిళలూ అభిమాన నేతను కలిసేందుకు పోటీపడ్డారు. ‘మూడు రోజుల నుంచి కలవాలనుకుంటున్నాం.. కలిశాం.. ఎంత మంచిగా మాట్లాడాడో...’ అంటూ అనూరాధ అనే మహిళ తనవాళ్లతో ఆనందంగా చెప్పుకుంది. దారిపొడవునా హారతులిచ్చేందుకు వచ్చే మహిళలు ‘ఈసారి జగన్‌ తప్పకుండా గెలుస్తాడు’ అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

హోదా కోసం ఉద్యమించే వారికి మద్దతు
హోదా సాధన సమితి నేతలతో జగన్‌
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఆయనకు ఏమాత్రం లేదని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను గుంటూరు శివారు ప్రాంతంలో చలసాని శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం కలిశారు. హోదా కోసం జగన్‌ చేస్తున్న పోరాటా నికి వారు మద్దతు తెలిపారు. పోరుబాటలో తాము కలిసి వస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జగన్‌ వారితో మాట్లాడారు. హోదాపై తాము ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని, త్వరలోనే మరోసారి సమావే శమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని చెప్పారు. సీఎం హోదాలో ఉన్న బాబు కేంద్రంపై గట్టిగా ఒత్తిడి చేసి ఉంటే, హోదా వచ్చి ఉండేదని తెలిపారు. ఆయన అడగకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఊపిరి అని, దీనిని గుర్తించి.. రాష్ట్ర విభజన సమయంలోనే అప్పటి కేంద్ర కేబినెట్‌ ఆమోదించి.. అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ప్లానింగ్‌ కమిషన్‌కు పంపిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏడు నెలలు చంద్రబాబు దీన్ని పట్టించుకోలేదన్నారు. ఆయన హోదాను సమాధి చేయాలని చూస్తే... ఉద్యమాల ద్వారా తమ పార్టీ సజీవంగా ఉంచిందని తెలిపారు. ఎంపీలు రాజీనామాలు చేసి, ఏపీ భవన్‌ వద్ద చేపట్టే ఆందోళనకు అందరూ మద్దతునివ్వాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలన్న లక్ష్యంతో ముందుకొచ్చే ఎవరికైనా తాము అండగా నిలుస్తామని చెప్పారు. హోదా కోరుతూ ఉద్యమించిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top