చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్‌

Peddireddy Slams Chandrababu In Chittor District - Sakshi

చిత్తూరు జిల్లా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. రాజకీయాల్లో తాను ఎంతో సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు, 10 ఏళ్లు హైదరాబాద్‌లో ఉండటానికి అనుమతి ఉన్నా అకస్మాత్తుగా హైదరాబాద్‌ను వదిలి పెట్టి కోట్ల రూపాయలు అద్దె రూపంలో చెల్లిస్లూ అన్నీ తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండి ఉంటే ఏపీ రాజధానిలో శాశ్వత భవనాలు నిర్మించుకుని ఉండేవాళ్లమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నావల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పడం, రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని ఏపీలో చెప్పడం బాబు రెండు నాల్కల ధోరణికి నిదర్శమన్నారు.

విడిపోయిన తర్వాత హోదా కోసం కాకుండా ప్యాకేజీ కోసం పాకులాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ పోరాడుతున్నా పార్లమెంటులో చర్చకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎటువంటి గొడవ లేకుండానే టీడీపీకి అనుమతి ఇచ్చారన్నారు. దీన్ని బట్టే బీజేపీ, టీడీపీలు కుమ్మక్కు అయినట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చేరారని అన్నారు. భారత దేశంలో ఎక్కువ సంపాదించిన వారిలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒకరని చెప్పింది చంద్రబాబు కాదా అని సూటిగా అడిగారు.

ముఖ్యమంత్రిగా కిరణ్‌ కొనసాగడానికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని కుట్రలైనా పన్నుతారని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఎంత మోసం చేశారో, మోదీ కూడా అంతే మోసం చేశారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీ ఓట్ల కోసమే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మహిళల రుణమాఫీ చేయడం కాదు కదా.. వారిని చంద్రబాబు అప్పులపాలు చేశారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.  బీసీ అధ్యయన సదస్సులు నిర్వహించి సమస్యలను, అభిప్రాయాలను క్రోడీకరించి, పాదయాత్ర పూర్తి అయ్యే లోపు బీసీలకు మనం ఇవ్వబోయే హామీల గురించి చెబుతామని వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top