
సాక్షి, అనంతపురం : తాను ఎవరికీ తొత్తులా వ్యవహరించడంలేదని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని, అంశాలను బట్టి మద్దతు ఇస్తానని తెలిపారు. ‘చలోరె చలోరె చల్’ కార్యక్రమంలో భాగంగా శనివారం అనంతపురం వచ్చిన ఆయన.. జనసేన పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
‘‘కరువు సమస్యలపై అధ్యయనం చేస్తా. పరిష్కారాల కోసం కేసీఆర్, చంద్రబాబులను కలుస్తా. నేను ఎవరికీ తొత్తునుకాను. రాజకీయాల్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. అంశాలను బట్టి మద్దతు ఇస్తా. రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతా. సీమ సమస్యలపై ఓ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలుస్తాం. ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటా. ఓటు బ్యాంకు రాజకీయాలకు నేను దూరం. నా పని నచ్చితేనే ఓటువేయమని అడుగుతా’’ అని పవన్ చెప్పుకొచ్చారు.
‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా పవన్ మూడు రోజులు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల విరామం తర్వాత నేడు అనంతకు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. సీమ కరువుపై కొందరు ముఖ్యులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.