
మీడియా సమావేశంలో పంతం గాంధీ
పెద్దాపురం: జనసేన టికెట్ల పంపిణీ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు డైరక్షన్లో జరుగుతోందా అని పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు పంతం గాంధీమోహన్ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, చిరంజీవి వెంటే నడిచానని, ఆయన సలహా మేరకే జనసేనలో చేరానని చెప్పారు. అయితే పార్టీలో టిక్కెట్ల పంపిణీ మాత్రం చంద్రబాబు సూచనల మేరకు, లాలూచీ వ్యవహారాలతో జరుగుతోందని ఆరోపించారు. అందుకే మనస్తాపం చెంది జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
విలువలతో కూడిన రాజకీయాలు చెస్తున్నానని పవన్ కబుర్లు చెబుతూ.. టిక్కెట్ విషయంలో తనను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అసలు పార్టీ అభ్యర్థులను ఏ విధంగా ప్రకటించారో పవన్ కల్యాణ్ గుండె మీద చేయి వేసుకుని జన సైనికులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జనసేన టిక్కెట్లు చిరంజీవి ఇచ్చారా.. లేక టీడీపీ చెబితే ఇచ్చారా అని నిలదీశారు. చివరివరకు చిరంజీవి వెంట అడుగులేయడమే తనకు టిక్కెట్ నిరాకరించడానికి కారణమా అని ప్రశ్నించారు. కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలోనే ఏ పార్టీలో చేరేదీ ప్రకటిస్తానని గాంధీ మోహన్ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దాపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కర్రి వీర్రాఘవులు, జనసేన నాయకులు పేకేటి సోమరాజు, పెట్టెల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.