రాజస్తాన్‌: గవర్నర్‌‌తో సీఎం భేటీ అందుకేనా!

Operation Lotus Appears To Have Failed Says NCP Leader Majeed Memon - Sakshi

జైపూర్‌/ఢిల్లీ: రాజస్తాన్‌లో వారం క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది. అయితే, అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయని, సంక్షోభం ముగియనుందని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కీలక నేత మజీద్‌ మీమాన్‌ చెప్తున్నారు. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి ఢోకా లేదని అంటున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా రాజస్తాన్‌లో ఆపరేషన్‌ లోటస్‌ విజయవంతం కాబోదని ఆయన జోస్యం చెప్పారు. విశ్వాసపరీక్షలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నెగ్గుతుందని మీమాన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాతో భేటీ కావడంలోనే సీఎం గహ్లోత్‌ విశ్వాసం తెలుస్తోందన్నారు. బీజేపీ పెద్దలతో కలిసి పైలట్‌ వేసిన ఎత్తుగడలు పారలేదని మీమాన్‌ చురకలు వేశారు.

భేటీ అందుకేనా?
గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాతో సీఎం గహ్లోత్‌ రాజ్‌భవన్‌లో శనివారం భేటీ అయ్యారు. 45 నిముషాలపాటు జరిగిన ఈ భేటీలో తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లిస్టును ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందించినట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు, భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల వివరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు బలపరీక్షకు అసెంబ్లీని సమావేశ పరచాలని కూడా ఈ భేటీలో సీఎం కోరి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్పీకర్‌ అనర్హత నోటీసులపై సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారి పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్ శుక్రవారం  విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్‌ హైకోర్టుకు విన్నవించారు.
(చదవండి: పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్‌: గహ్లోత్‌)

ఆహ్వానిస్తాం
కాగా, పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని సీఎం గహ్లోత్‌, కాంగ్రెస్‌ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీలో చేరేది లేదని పైలట్‌ ఇదివరకే స్పష్టం చేశాడు. తదుపరి కార్యాచరణ చెప్పలేదు. ఈనేపథ్యంలో సోమ, మంగళవారాలు రాజస్తాన్‌ రాజకీయాలు కీలకం కానున్నాయి. ఇక రాజస్తాన్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) ప్రభుత్వ కుట్రలపై ఆడియో టేపులను సెషన్స్‌లో కోర్టులో సమర్పించింది. బీజేపీ నేతలు అశోక్‌ సింగ్‌, భరత్‌ మిలానీని ఎస్‌ఓజీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అయితే, ఆడియో టేపులన్నీ అసత్య ఆరోపణలనీ బీజేపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. ఒకవేళ ఎవరి ఫోన్లనైనా ట్యాపింగ్‌ చేస్తే ఆ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
(నేను బీజేపీతోనే..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top