ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు

MP Vinod comments on no confidence motion against bjp - Sakshi

ఎన్డీఏ సర్కారుపై టీఆర్‌ఎస్‌ ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని టీఆర్‌ఎస్‌ విమర్శించింది. లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడారు. ‘నాలుగేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. వాటిని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తొలి కేబినెట్‌ సమావేశంలో పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపింది. ఈ మండలాలను మళ్లీ తెలంగాణలో కలిపేలా కేంద్రం విభజన చట్టాన్ని సవరించాలి.

7 ముంపు మండలాల్లో భాగమైన 500 మెగావాట్ల సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును ఏపీకే ఇవ్వడంతో మా రాష్ట్రంలోవిద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించుకొనేదాకా ఏపీ విద్యుత్‌ సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా అమలు కాలేదు. మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం. ముంపు మండలాలను కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని బాబు పలు సందర్భాల్లో మీడియా సాక్షిగా అన్నారు.

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నిధులివ్వాలి
ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి ఖర్చును భరిస్తామని విభజన చట్టంలో పేర్కొన్న నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టును విస్మరించిందన్నారు. మాకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలి.

బాబు వల్లే హైకోర్టు ఆలస్యం
‘హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే వెంటనే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అప్పటి కేంద్ర న్యాయ మంత్రి స్పష్టం చేశారు. కానీ ఏపీ ఇప్పటికీ ముందుకు రాలేదు. సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్న ఏపీ, హైకోర్టును ఎందుకు నిర్మించుకోలేకపోతోందో చెప్పాలి. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలని నీతిఆయోగ్‌ సిఫార్సు చేసింది. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి.

గల్లా వ్యాఖ్యలపై సభలో దుమారం
ఆంధ్రప్రదేశ్‌ను అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గల్లా తన ప్రసంగంలో రాష్ట్ర విభజన అప్రజాస్వామికం అనండంపై టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. గల్లా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆమోదంతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికమెలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం చంద్రబాబు కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ‘అప్రజాస్వామికం, అశాస్త్రీయం’ అనే మాటలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top