
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఈ విషయంలో తాను చాలెంజ్ చేస్తున్నానని అన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రం విషయంలో సామదాన భేదాలు అయిపోయాయని, దండోపాయమే ఉందని, ఇకపై యుద్ధమేనని చెప్పారు.
దేశంలో ఎక్కువ మంది మాట్లాడే రెండో భాషగా తెలుగు ఉందని, మోదీ తెలుగు నేర్చుకోవాలన్నారు. ఇది గుజరాత్ కాదని ఆంధ్రప్రదేశ్ అని, ఇష్టానుసారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మోదీకి పెద్దలను గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదన్నారు. బీజేపీలో సీనియర్ నేత అద్వానీని గౌరవించాలన్నారు. కట్టుకున్న భార్యను గౌరవించడం మోదీకి తెలియదన్నారు. యుద్ధం మొదలైందని, తెలుగు ప్రజలు మోదీని తరిమికొడతారని చెప్పారు.
గతంలో బీజేపీకి ఎన్టీఆర్, చంద్రబాబు బిక్ష పెట్టారన్నారు. ఇక్కడి వారితో కలసి చిల్లర రాజకీయాలు, వేషాలు వేస్తున్నారని, నిరాహార దీక్షల వెనుక ఎన్ని ప్యాకేజీలున్నాయో తమకు తెలుసన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవిత్ర జలాలు లేవనా మట్టి, నీరు తెచ్చావని మోదీని ప్రశ్నించారు. అమిత్‌షా గిమిత్‌షాల భజన ఇక్కడ నడవదని, దమ్ముంటే బయటకు రావాలన్నారు. ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధులుగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.