ఓటమి భయంలో చంద్రబాబు

Lakshmi Parvathi comments on CM Chandrababu - Sakshi

     ఏపీని పాలించే అర్హత లేదు 

     వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌:  వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. ఏడాదికి ముందే ఆయనకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గోదావరి వంతెనపై జనగోదారిని తలపించిన జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర దృశ్యాన్ని టీవీల్లో చూచి చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. దీంతో టీడీపీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ సమన్వయకమిటీ సమావేశాల్లో ఆదేశిస్తున్నారని తెలిపారు. 

ఈవీఎంలపై బాబు మాట్లాడడం సిగ్గుచేటు
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్‌ చేసే గెలిచారా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుకు మంచిది కాదన్నారు.  ఈవీఎం ట్యాంపరింగ్‌ చేయడంలో శిక్షణ పొందిన హరికృష్ణ ప్రసాద్‌కు రూ. 500 కోట్ల ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టును టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టిందని పవన్‌కళ్యాణ్‌ విమర్శించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ట్యాంపరింగ్‌లో ట్రైనింగ్‌ పొందిన దొంగను పక్కన పెట్టుకుని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాసిపూసి మారేడు కాయ చేయటమేనన్నారు. టీటీడీలో రాజకీయం చేసింది చంద్రబాబేనని చెప్పారు.  

శేఖర్‌రెడ్డి కేసుకు సంబంధించి లోకేశ్‌పై పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు చేశారని, ఆ కేసుపై ఎందుకు విచారణ చేయించడం లేదని నిలదీశారు. ఇకనైనా టీడీపీని ఎన్టీఆర్‌ కుటుంబానికి అప్పగించి.. సీఎం పదవి బాలకృష్ణకు కట్టబెట్టి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. ఎన్టీఆర్‌ సినిమాపై ఇప్పటివరకు తనను ఎవ్వరూ సంప్రదించలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top