మాయమాటలతో అధికారంలోకి వచ్చే కుట్ర

Kyama Mallesh Slams On KCR - Sakshi

యాచారం (రంగారెడ్డి): కేసీఆర్‌ మాయమాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. యాచారంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం కేసీఆర్‌ ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని విమర్శించారు. ప్రజలను మాయలో ముంచి రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రాకుండా అందరూ కృషి చేయాలని సూచించారు. కేసీఆర్‌ తన నాలుగేళ్ల పాలనలో పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో రియల్‌ వ్యాపారం చేసి రూ. కోట్ల రూపాయలు జమచేశారని ఆరోపించారు.

నేడు ఆ డబ్బుతో ఎన్నికల్లో అడ్డదారిలో పీటం ఎక్కేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు నమ్మే పరిస్థితిలో జనం లేరన్నారు. జనంలో వ్యతిరేక ప్రభావం ఉండడం గమనించి ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి సీఎం కేసీఆర్‌ కుటిలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధుతో పేద రైతులకు, కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఉన్న భూమి రికార్డుల్లోకి ఎక్కక, పట్టాదారు, పాసుపుస్తకాలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. సీలింగ్,  భూదాన్‌ భూములన్న రైతులకు తక్షణమే పట్టాదారు, పాసుపుస్తకాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, ఇంటి నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పేదలు ఆర్థిక ప్రగతి సాధించేలా పథకాలు అమలు చేస్తామని తెలిపారు. మళ్లీ వైఎస్సార్‌ పాలనను తీసుకొస్తామని పేర్కొన్నారు.

నా టికెట్‌పై అనుమానాలు వద్దు: క్యామ  
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్‌ తనకే వస్తుందని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందరాదని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ పేర్కొన్నారు. తన గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు అండగా ఉన్నానని తెలిపారు. అధిష్టానం ఆదేశాలను పాటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు టికెట్‌ రావడం గ్యారంటీ అని.. ప్రజలు అశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

5న యాచారంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉందని, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆడాల గణేష్, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు విష్ణు, యాచారం మాజీ సర్పంచ్‌ యాదయ్య తదితరులు ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top