
సాక్షి, అమరావతి: రాజధాని వికేంద్రీకరణ ఎందుకు కుదరదో టీడీపీ స్పష్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. టీడీపీకి సొంత, రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టవని నిప్పులు చెరిగారు. అమరావతితోనే టీడీపీ ప్రయోజనాలన్నీ ముడిపడి ఉన్నాయని, ఆ పార్టీ నేతలు అక్కడ బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు, ఆస్తులు కొనుగోలు చేశారని విమర్శించారు. వికేంద్రీకరణ జరిగితే వాటి విలువ పడిపోతుందనే భయంతోనే బిల్లులకు ఆడ్డుతగులుతున్నారని ఆరోపించారు. బిల్లులు చర్చకొచ్చిన సమయంలో గ్యాలరీలో కూర్చుని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండలిని శాసించడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. విచక్షణాధికారం పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. శనివారం విజయవాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేమిటి?
► నాడు ఎన్టీఆర్ శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరితే అందుకు ససేమిరా అన్న యనమల రామకృష్ణుడికి విలువల గురించి, నియమాల గురించి మాట్లాడే అర్హత ఉందా?
► యనమల తనకు తప్ప ఎవరికీ నియమ, నిబంధనలు తెలియవన్నట్లు మాట్లాడుతున్నారు. మండలిలో రెండోసారి బిల్లు పెట్టిన నెల తర్వాత అది ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుందనే విషయం తెలియదా?
► రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలో ఘనుడైన యనమల రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌కు వికేంద్రీకరణ బిల్లులపై సూచనలు చేస్తూ లేఖ రాయడం దౌర్భాగ్యం.
► శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణ అవçసరమని స్పష్టంగా చెప్పింది.
► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల అభిప్రాయాలను టీడీపీ నేతలు తెలుసుకోవాలి.
► చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిని అభివృద్ధి చేయకుండా తాత్కాలిక భవనాలనే నిర్మించారు. రాజధానికి వెళ్లడానికి సరైన రహదారిని కూడా నిర్మించలేకపోయారు.
► రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించకుండా టీడీపీ సమస్యలు సృష్టిస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు.
► అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ఈ మేరకు జిల్లాల వారీ అభివృద్ధికి బ్లూప్రింట్ల తయారీకి చర్యలు తీసుకున్నారు.
రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు
► ఇటీవల వర్షాలకు ఉభయగోదావరి జిల్లాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. అటువంటి రైతులకు రైతుభరోసా కేంద్రాల ద్వారా సోమవారం నుంచి 80 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేస్తాం.
► ఈ నెల 20 నుంచి వచ్చే నెల 7 వరకు కౌలు రైతుల పక్షోత్సవం నిర్వహించనున్నాం.