కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా... 

Kishan Reddy Take Oath As Central Minister - Sakshi

తెలంగాణ బీజేపీ నేత ‘కిషనన్న’ ప్రస్థానం

అంచెలంచెలుగా ఎదిగిన గంగాపురం కిషన్‌రెడ్డి

బీజేవైఎం పగ్గాల నుంచి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వరకు ఎన్నో బాధ్యతలు

కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. సికింద్రాబాద్‌ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అంతా ఊహించినట్లే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం లభించింది. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందగా.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కిషన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో చోటు లభించిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కిషన్‌రెడ్డికి ఫోన్లో తెలియపరిచారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తలపాగా ధరించి వచ్చిన ఆయన హిందీలో ప్రమాణం చేశారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డి... లోక్‌సభ ఎన్నికల్లో 62,144 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి సత్తా నిరూపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ కేంద్ర కేబినెట్‌లో ఆయనకు స్థానం కల్పించింది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తించే కిషన్‌రెడ్డి క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. 

సాధారణ రైతు కుటుంబం నుంచి.. 
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 1964 మే 15న సాధారణ రైతు కుటుంబంలో కిషన్‌రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి స్వామిరెడ్డి, తల్లి ఆండాళమ్మ. జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో 1977లో జనతా పార్టీలో కార్యకర్తగా చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత... యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా క్రియాశీలకంగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1986లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షునిగా నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ స్థాయిల్లో పనిచేసి 2002లో యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించారు. రాష్ట్ర, జాతీయ పార్టీలోనూ పలు బాధ్యతలు చేపట్టిన ఆయన... 2010లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు 2004 శాసనసభ ఎన్నికల్లో హిమాయత్‌నగర్‌ నుంచి కిషన్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్‌నగర్‌ అంబర్‌పేటలో విలీనమవడంతో 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. 

తెలంగాణకు ప్రాధాన్యం.. 
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్‌ షా నాయకత్వంలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం కల్పించేందుకు సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే అనూహ్యంగా మధ్యలో ఆ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. అప్పటి నుంచి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లేనట్లయింది. మళ్లీ ఇప్పుడు అదే స్థానం నుంచి గెలిచిన కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. 

మోదీతో ప్రత్యేక అనుబంధం... 
ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణం. మొత్తానికి కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

కిషన్‌రెడ్డి కుటుంబ, రాజకీయ నేపథ్యమిదీ... 
జననం : మే 15, 1964 
తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ 
భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్‌ 
రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక 
1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు 
1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్‌ 
1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు 
1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి 
1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు 
1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి 
2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 
2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు 
2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి 
2004: మొదటిసారిగా హిమాయత్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక 
2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
2009, 2014: అంబర్‌పేట ఎమ్మెల్యే 
2018: అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి 
2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా విజయం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top