డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!

KCR to Dissolve The Assembly in September? - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌: ఈ ఏడాది నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకు అనుగుణంగా సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌ మొదటి వారంలో శాసనసభ రద్దయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం.. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సందర్భంగా నవంబర్‌ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

దేశమంతటా అన్ని రాష్ట్రాల శాసనసభలతోపాటే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాని పక్షంలో తాము నాలుగైదు నెలల ముందు ఎన్నికలకు వెళ్లబోతున్నామని ప్రధాని దృష్టికి సీఎం తెచ్చినట్లు అత్యున్నత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిపేందుకు వీలుగా అసెంబ్లీ రద్దుకు సీఎం ఇప్పటికే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సోమవారం నాటి మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలు దీన్నే సూచిస్తున్నాయి.

అసెంబ్లీ రద్దు చేస్తారా అని ఓ విలేకరి అడగ్గా.. రద్దు చేయాల్సి వస్తే చెప్పి చేస్తానా అని కేసీఆర్‌ ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేస్తే ఆ 4 రాష్ట్రాలతోపాటే ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులుండవని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ కాలపరిమితి ఆరు మాసాలు ఉంటే ఆ లోగా ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లవచ్చని, సహజంగా ఏడాది ముందే ఎన్నికలకు తాము అన్ని ఏర్పాట్లు ప్రారంభిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఒకరు తనను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

అక్టోబర్‌లోనే మిషన్‌ భగీరథ షురూ
గ్రామాలకు రక్షిత మంచినీరు ఇచ్చిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామని గతంలోనే కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆ హామీ అమలు దిశగా మిషన్‌ భగీరథ పనులు వాయువేగంతో సాగుతున్నాయి. ఆరుగురు చీఫ్‌ ఇంజనీర్లు 24 గంటలపాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్‌లో పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికలషెడ్యుల్‌కు ముందే ప్రారం భించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.

మంత్రి హరీశ్‌రావు వారంలో 4 రోజులు కాళేశ్వరంలోనే ఉండి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయాలను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుబంధు పథ కం కింద రైతాంగానికి రెండో విడత సాయం కూడా అదే నెలలో పూర్తి చేసేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే రాష్ట్ర స్థాయిబ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం.

సెప్టెంబర్‌ సభతో శంఖారావం!
సెప్టెంబర్‌ 2న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా వచ్చే ఎన్నికలకు నాంది పలకాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. సోమ వారం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో అదే నెలలో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.  అక్టోబర్, నవంబర్‌ నాటికి 31 జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ద్వారా పూర్తిగా ఎన్నికల బరిలోకి దిగాలన్నది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.

లోక్‌సభతోపాటు శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాధాన్యం రాదన్న అభిప్రాయం తో కేసీఆర్‌ ఉన్నారు. అందువల్ల షెడ్యుల్‌ కం టే నాలుగైదు మాసాల ముందే ఎన్నికలకు వెళ్తే ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నది ఆయన యోచ నగా పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 సీట్లకు తగ్గకుండా గెల్చుకోగలిగితే 2019లో కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించవచ్చని, తద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఒకేసారి అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేనాటికి మొత్తం 119 అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో లాంఛనప్రాయంగా కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నా.. 100కు పైగా అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒకేసారి అభ్యర్థులను వెల్లడించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. పార్టీలో టికెట్లు ఆశిస్తున్నవారితో చర్చలు జరిపి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు సీనియర్లతో ఓ కమిటీని వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఏదైనా నియోజకవర్గంలో ఒకరు అంతకంటే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న పక్షంలో టికెట్‌ రాని వారికి పార్టీలో, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పి, వారిని ఒప్పించే బాధ్య తను ఈ కమిటీ తీసుకుంటుందని ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. గతంలో మాదిరి కాకుండా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన మరుక్షణమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు, వివాదాలకు తావు లేని రీతిలో పార్టీ ప్రణాళిక ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top