మాకు ఓటు వేయకపోతే మీకు ఓటు ఉండదు | Democracy is derided by the ruling party conspiracies | Sakshi
Sakshi News home page

మాకు ఓటు వేయకపోతే మీకు ఓటు ఉండదు

Feb 21 2018 3:05 AM | Updated on Aug 10 2018 8:46 PM

Democracy is derided by the ruling party conspiracies - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన హక్కు.. ఓటు. ఇప్పుడా హక్కుకు దిక్కు లేకుండా పోతోంది. ప్రతిపక్షానికి ఓటు వేస్తారనే అనుమానం వస్తే చాలు ఓటర్ల జాబితాల నుంచి పేర్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అధికార బలంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఒక్క ఓటు కూడా పడొద్దు, తామే శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న యావతో రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా 14.77 లక్షల ఓట్లపై గొడ్డలి వేటు వేశారు. ఇవన్నీ ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం రాష్ట్రంలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టింది. ఈ ఏడాది జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు మృతి చెందిన వారు, వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే కార్యక్రమం నిర్వహించింది. అధికార తెలుగుదేశం పార్టీ దీన్నొక అవకాశంగా వాడుకుంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండే ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. ఏకంగా 14.77 లక్షల ఓట్లను తొలగించారు. అత్యధికంగా వైఎస్సార్‌ జిల్లాలో 3.20 లక్షల ఓట్లపై వేటు వేశారు. 

తనిఖీలు లేకుండానే తొలగింపు  
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కచ్చితంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారనే అంచనా ఉన్న ఓటర్లపై గురిపెట్టారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల నుంచి 15 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ బూత్‌లో నివాసం ఉండడం లేదు, వలస వెళ్లారు అనే సాకులతో ఓట్లను అడ్డగోలుగా తొలగించేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే 14 లక్షల మంది వలస వెళ్లడం, మరో చోట నివాసం ఉండడం వంటివి జరగవని పరిశీలకులు అంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక రెవెన్యూ అధికార యంత్రాంగంతో కుమ్మక్కై భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించారని చెబుతున్నారు. ఓటర్లు ఇక్కడ ఉండడం లేదు, వారి ఓట్లను తొలగించాలంటూ టీడీపీ నేతలే స్వయంగా దరఖాస్తులు చేయడం గమనార్హం. ఎందుకు తొలగించారని జనం ప్రశ్నిస్తే.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వలస వెళ్లిన, మృతి చెందిన వారి ఓట్లను తొలగించాలంటే కచ్చితంగా వారి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించాలి. రాష్ట్రంలో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే అధికార పార్టీ నేతలు చెప్పినట్లు అధికారులు నడుచుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

లోపాలుంటే ఫిర్యాదు చేయొచ్చు: సిసోడియా 
తాజాగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే జిల్లా ఎలక్టోరల్‌ అధికారులు (డీఈఓ) విచారణ జరిపిస్తారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ఆర్‌పీ సిసోడియా తెలిపారు. జిల్లా పరిధిలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం డీఈవోలుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లకు ఉంటుందని పేర్కొన్నారు. 

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రెడ్డి సోమరాజు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో నివశిస్తున్నారు. 30 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ఓటర్ల జాబితా సవరణలో సోమరాజు ఓటును తొలగించారు. అంతేకాదు ఆయన ఇంట్లోని మరో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కుకు దూరమయ్యారు. తామంతా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులమని, అందుకే అధికార పార్టీ తమ ఓట్లను కుట్రపూరితంగా తొలగించిందని సోమరాజు ఆరోపిస్తున్నారు. 

ఈయన పేరు ఎన్ని ధనుంజయ్‌. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి. గత 26 ఏళ్లుగా శ్రీకాకుళంలో నివసిస్తున్నారు. పోలింగ్‌స్టేషన్‌ 155లో ఓటు హక్కు ఉండేది. కొత్త ఓటర్‌ జాబితాలో ధనుంజయ్‌ పేరు కనిపించడం లేదు. ఆయన ఓటును తొలగించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి, తమ ఓట్లను తొలగించారని ధనుంజయ్‌ మండిపడుతున్నారు. 

ఇల్లు మారామని ఓటు తీసేశారు 
‘‘అనంతపురంలోని లక్ష్మీమనగర్‌లో సొంత ఇంట్లో ఉంటున్నాం. ఇటీవల మా ఆయన ఓటు (వైడబ్ల్యూబి 2028018), నా ఓటు (వైడబ్ల్యూబి 2027994) ఓటర్‌ జాబితా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారని అధికారులను అడిగితే ఇల్లు మారడంతో తొలగించామంటూ సమాధానం ఇచ్చారు. నిజానికి మేము ఇల్లు మారలేదు’’    
– బి.మణి, అనంతపురం





కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా.. 
‘‘పాతికేళ్లుగా విశాఖపట్నం అల్లిపురంలో నివసిస్తున్నాను. ఐదు ఎమ్మెల్యే, ఐదు ఎంపీ ఎన్నికలు, 4 కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఓటరు జాబితాలో నా పేరు కనిపించలేదు. దీంతో జిల్లా కలక్టర్‌కు ఫిర్యాదు చేశాను’’   
 – పచ్చిరిపల్లి లక్ష్మీ, అల్లిపురం, విశాఖపట్నం, 28వ వార్డు మాజీ కార్పొరేటర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement