‘సీఎం కేసీఆర్‌ పద్ధతి చావప్పుడు పెళ్లిలా ఉంది’

CPI Narayana Slams KCR Over Telananga Secretariat Demolition - Sakshi

సచివాలయం కూల్చివేతపై సీపీఐ నారాయణ విమర్శలు

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ నగరానికి చరిత్రే లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయంలాంటి పురాతన కట్టడాలను కూల్చడం సరైన పద్ధతికాదని హితవు పలికారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సచివాలయం  కూల్చివేసే సందర్భంగా నిజాం నవాబులను పొగిడే వాళ్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సీఎం కేసీఆర్‌ కూడా నిజాం నవాబును  అనేకసార్లు పొగిడారు. నిజాం నవాబు వారసులు నాకు ఫోన్ చేసి మీరు..  నిజాం నవాబును విమర్శిస్తున్నారు మంచిది కాదని హెచ్చరించారు.

ఇప్పుడు నేను వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే మేనమామ సర్ వికార్ ఉల్ ఉమ్రా ఆలోచన ప్రకారం నిజాం 6వ నవాబు మహబూబ్ అలీఖాన్.. లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ నమూనాతో తెలంగాణ సచివాలయంలో ఒక భవనాన్ని నిర్మించారు. వికారాబాద్‌కు కూడా ఆయన పేరే పెట్టారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన భవనాన్ని పురావస్తు శాఖకు అప్పగిస్తే బాగుండేది. పురాతన భవనాలను పడగొడితే హైదరాబాద్ ప్రాముఖ్యత కనిపిస్తుంది. పురాతన భవనాలు కూలగొట్టడం సరైన పద్ధతి కాదు. వాటిని పురావస్తు శాఖకు అప్పగించి సంస్కృతిని కాపాడాలి.
(చదవండి: సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్‌)

కేసీఆర్‌ శకం నుంచే హైదరాబాద్‌ నిర్మాణమైనట్టు చూపిస్తున్నారు. గతంలో నిజాం నవాబు పరిపాలన గాని, పది మంది ముఖ్యమంత్రులు పాలించినట్లు గాని చెప్పకుండా తానే హైదరాబాద్  నిర్మించినట్లు చూపించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సచివాలయానికి అన్ని హంగులతో భవనాన్ని కట్టడానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను. కరోనా కేసులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా మారింది. కోవిడ్‌తో బాధపడుతున్నవారిని కాపాడాల్సింది పోయి కొత్త సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్యే. దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు సరైన సమయం కాదు.

ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు. ఆయనకు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ, ఆయనకు వచ్చిందని నేనేమీ అనుకోను. ఆయన చాలా తెలివైనవారు.  ప్రజలందరికీ కోవిడ్ తెప్పిస్తారు గాని  ఆయన తెచ్చుకోరు. కోవిడ్ పేషెంట్లకు సచివాలయంలో చికిత్స అందించాలి. కానీ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పురాతన భవనాలు కూల్చి కొత్తవి కట్టడం.. చావప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప మరొకటి కాదు’అని నారాయణ విమర్శించారు.
(ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్‌ ఆవేదన)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top