కాంగ్రెస్‌ ‘ఎమ్మెల్సీ’ బహిష్కరణ

Congress In Telangana To Boycott MLC Election - Sakshi

టీఆర్‌ఎస్‌ తీరుకు నిరసనగా హస్తం పార్టీ నిర్ణయం

సీఎం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపణ

విప్‌ జారీ.. పార్టీ ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లే యోచన

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ తరఫున గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కలు సోమవారం ప్రక టించారు. సంఖ్యాపరంగా తమకు ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మంగళవారం జరిగే పోలింగ్‌కు దూరం గా ఉండాలని, ఎవరూ ఓటేయొద్దని భట్టి విక్రమార్క విప్‌ జారీ చేశారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని కూడా కాంగ్రెస్‌ నిర్ణయించింది. సీఎం తీరుపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించింది.

ఆ ఐదుగురు ఏం చేస్తారు?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను బహిష్కరించాలని కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయిన ఆ ఐదుగురు ఎమ్మె ల్యేలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తు తం కాంగ్రెస్‌ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే.. మిగిలిన ఎమ్మెల్యేలు పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫలితంలో మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు ఓటేయకపోయినా ఐదుగురు అధికార పక్ష ఎమ్మెల్యేల విజయం దాదాపు ఖాయమే. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు కేసీఆర్‌ బాటలో పయనిస్తామని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటించిన వారు కూడా అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరలేదు.

దీంతో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎమ్మెల్యేలు ఓటేసిన పక్షంలో కాంగ్రెస్‌ విప్‌ను ధిక్కరించినట్టవుతుంది. తద్వారా చట్టపరమైన చర్యలకు ఊతమిచ్చినట్టవుతుంది. దీంతో ఈ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు రాకపోవచ్చనే తెలుస్తోంది. కానీ, కేసీఆర్‌ తన∙బలాన్ని చాటు కునేందుకు, ఆసక్తికర నిర్ణయాలు తీసుకునేందుకు ముందు వరుసలో ఉంటారనేది బహిరంగ రహస్య మే. దీంతో తన పక్షానికి వస్తున్నట్టు ప్రకటించిన వారిని కూడా పోలింగ్‌లో పాల్గొనాలని ఆదేశాలిచ్చి నా ఆశ్చర్యం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడు తూ.. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, కేసీఆర్‌ నిర్ణయం మేరకు నడుచుకుంటామని, అవసరమైతే పోలింగ్‌లో పాల్గొనేందుకు కూడా వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top