‘కమీషన్ల కక్కుర్తితోనే మిషన్‌ భగీరథ’

Congress Leader Jeevan Reddy Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

ఇంటింటికీ నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడుగబోనన్న కేసీఆర్‌.. ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతుతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎల్లంపల్లి ప్రాజెక్టును దాదాపు 45 శాతం పూర్తి చేయగా, ఈ నాలుగేళ్లలో 55 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. దీని వల్ల ఎల్లంపల్లి నుంచి దాదాపు రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంలో ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అవుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. దీని వల్ల ప్రజలపై అప్పులభారం పెరుగుతోందన్నారు. కమీషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారన్నారు.

పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు లక్షల్లో నష్టపోతుంటే 4వేల పెట్టుబడి సాయం ఇస్తే ఏం ఉపయోగమని ప్రశ్నించారు. రైతు బీమా పేరుతో ఎల్‌ఐసీ కంపెనీకీ మార్కెటింగ్‌ ఏజెంట్‌గా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు కల్పించే ఏ సంక్షేమమైనా రైతు కూలీకి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటు అడిగే హక్కు కోల్పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top