15 ఏళ్ల ఎదురుచూపులు ఫలిస్తాయా?

Congress on fate in Madhya Pradesh elections - Sakshi

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భవితవ్యంపై కథనం

15 ఏళ్ల అధికార బీజేపీ జైత్రయాత్రను అడ్డుకోగలదా? కీలకమైన మధ్య ప్రాంతాల్లో పట్టు  సాధించగలదా? నవంబర్‌ 28న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీపై తలెత్తుతున్న అనుమానాలివి.

కూటమి కుదర్లేదు
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై పోరుకు విపక్ష కూటమిని కూడగట్టాలన్న కాంగ్రెస్‌ ప్రణాళికలు రచించింది. అదే కూటమిని రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావించింది. కానీ విపక్ష కూటమి ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. కూటమిలో ప్రధాన పక్షాలుగా భావించిన పార్టీలన్నీ ఒంటరి పోరుకే మొగ్గు చూపాయి.

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ), నేషనలిస్టిక్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లు వేర్వేరుగానే రంగంలోకి దిగాయి. సొంతంగా 200 సీట్లకు పోటీచేస్తున్నట్టు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదంపై కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది.

మధ్యప్రాంతాలే కీలకం
అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలోని మాల్వా, మధ్య ప్రాంతాల్లోని (సెంట్రల్‌ రీజియన్‌) 86 సీట్లు అత్యంత కీలకం. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గెలిచింది 10 సీట్లలో మాత్రమే. అప్పటివరకు కాంగ్రెస్‌కు ఆ ప్రాంతాల్లో కనీసం 30 సీట్లలో గెలవగలిగే బలముండేది. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బీజేపీ 50% పైగా ఓట్లతో 74 సీట్లలో విజయ భేరీ మోగించింది. బీజేపీ గెలిచిన వాటిలో మాల్వా ప్రాంతంలో 45, సెంట్రల్‌ రీజియన్‌లో 29 సీట్లు ఉన్నాయి. 

కాంగ్రెస్‌ మాల్వాలో 4, సెంట్రల్‌ రీజియన్‌లో 6 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. సెంట్రల్‌ రీజియన్‌లోని బుధ్ని నుంచే సీఎం శివరాజ్‌చౌహాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండోర్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేతలు సుమిత్ర మహాజన్, కైలాష్‌ విజయ్‌లకు మాల్వా ప్రాంతంపై మంచి పట్టుంది. కీలకమైన ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రదర్శన పూర్తిస్థాయిలో మెరుగైతేనే అధికార సాధన సులువవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

హిందూ మంత్రం గట్టెక్కించేనా?
బీఎస్‌పీతో కోరుకున్న పొత్తు కుదరకపోవడంతో అగ్రవర్ణాలు ముఖ్యంగా బ్రాహ్మణుల ఓట్లను తిరిగి సాధించడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలనన్నింటినీ సందర్శిస్తూ హిందువుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ను శివభక్తుడిగా చూపుతూ, శివలింగానికి  రాహుల్‌ అభిషేకం చేస్తున్న ఫొటోలతో స్వాగత తోరణాలు, బ్యానర్లు వెలిశాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన దారిలో ఉన్న చిత్రకూట్‌లోని కామ్‌టానాథ్‌ దేవాలయంలో పూజలతో రాహుల్‌ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

ఆంటోనీ కమిటీ ఏం చెప్పింది ?
మైనారిటీ పక్షపాత రాజకీయాల కారణంగా మెజారిటీ హిందువులకు దూరం అవుతున్నామన్న  భావన కాంగ్రెస్‌ పార్టీలో గత కొంతకాలంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో మూడోసారి ఓటమితో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసినప్పటి నుంచి ఈ విషయంలో అంతర్మథనం మొదలైంది.

దీనిపై సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీ ఒక కమిటీని వేసింది. ముస్లిం అనుకూల వైఖరి కారణంగానే వరస ఓటముల బారిన పడుతున్నట్లు ఆ కమిటీ తేల్చింది. కాంగ్రెస్‌ను ముస్లిం అనుకూల పార్టీగా భావించి మెజారిటీ హిందువుల్లోని కొన్ని వర్గాలు  పార్టీకి దూరమవుతున్నాయని పేర్కొంది. సెక్యులరిజానికి కొత్త నిర్వచనం ఇస్తూ మెజారిటీ హిందువుల మన్నన పొందేందుకు ప్రయత్నించాల్సిందిగా ఈ కమిటీ సూచించింది.

ప్రభావం చూపే అంశాలు..
రైతాంగ సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించాలని, రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2017 జూన్‌లో మందసోర్‌లో ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చి.. పోలీసు కాల్పులకు దారి తీసింది. ఆ కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు.  
  సపాక్‌ అనే సంస్థను స్థాపించి జనరల్, ఓబీసీ,  మైనారిటీ ఉద్యోగులు ఏకతాటిపైకి వస్తున్నారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
  2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలు 20.3%, ఎస్సీలు 15.2%  ఉన్నారు. ఈ వర్గాల ఓట్లు మెజారిటీ స్థానాలను ప్రభావితం చేయనున్నాయి.
  నిరుద్యోగంతో 11.2 లక్షల మంది ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ల్లో నమోదు చేసుకుంటే 2017లో 422 మందికే ఉద్యోగాలొచ్చాయి.

గత 3 ఎన్నికల్లో ఇలా..!
2003లో
బీజేపీ – 173 (42.5%)
కాంగ్రెస్‌ – 38 (38.87%
(ఈ ఎన్నికల్లో ఉమాభారతి సారధ్యంలో బీజేపీ పదేళ్ల దిగ్విజయ్‌ పాలనకు చరమగీతం పాడింది)

2008లో
బీజేపీ – 143 (37.64%)
కాంగ్రెస్‌ – 71 (32.39%)

2013లో
బీజేపీ – 165 (44.88%)
కాంగ్రెస్‌ – 58 (42.67%)
(2008, 2013 ఎన్నికల్లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బీజేపీని విజయతీరాలకు చేర్చారు) 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top