లివ్ అండ్ లెట్ లివ్ మా విధానం : కేసీఆర్‌

CM KCR Says Will Maintain Good Relations With AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్‌తో కూడా అదే విధానం అవలంబిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం సాయంత్రం సతీ సమేతంగా ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాము. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ -మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను. లివ్ అండ్ లెట్ లివ్ మా విధానమని చెప్పాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పాను. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌తో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’ అని ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేసీఆర్ అన్నారు.

ఆ నీరంతా ఏపీ వాడుకునే వీలుంది..
‘‘గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700- 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఏపీ వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలో త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.

కాగా ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జరగనున్న తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని కేసీఆర్‌ను వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు.  ఈ సందర్భంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వైఎస్ జగన్‌కు.. కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని.. పోచంపల్లి ఇక్కత్ శాలువాకప్పి సన్మానించారు. అనంతరం కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపిక బహుకరించారు. సీఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్‌ జగన్‌ దంపతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా కేసీఆర్‌ను కలిశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top