కశ్మీర్‌ విభజన బిల్లుకు అనూహ్య మద్దతు

BSP, AAP, BJD Surprise Support to Govt on Article 370 - Sakshi

బీఎస్పీ, ఆప్‌, బీజేడీ, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ తదితర పార్టీల సపోర్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును సత్వరమే ఆమోదించేదిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభలో ఈ బిల్లు సునాయసంగా గట్టెక్కెంది. అదేవిధంగా ఆర్టికల్‌ 370ను రద్దు చేసే తీర్మానాన్ని కూడా రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పెద్దల సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉన్నారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో రాజ్యసభలో ఈ కీలక బిల్లును ఆమోదించుకుంది.

బీజేపీ అంటేనే మండిపడే బీఎస్పీ, ఆప్ మొదలుకొని..  వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ తదితర విపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికాయి. అయితే, ఈ విషయంలో బీజేపీ మిత్రపక్షం జేడీయూ కేంద్రానికి షాక్‌ ఇవ్వడం గమనార్హం. ఒక్క జేడీయూ మినహా ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ బిల్లు విషయంలో కేంద్రానికి అండగా నిలిచాయి. ఈ బిల్లును కాంగ్రెస్‌, ఎస్పీ, జేడీయూ, డీఎండీకే, డీఎంకే, సీపీఎం, పీడీపీ, ఎన్సీపీ, ఎన్సీ తదితర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇందులో ఎన్డీయే భాగస్వామి జేడీయూ, కాంగ్రెస్‌ మిత్రపక్షం ఎన్సీపీ బిల్లుపై ఓటింగ్‌కు దూరంగా ఉంటామని విస్పష్టంగా ప్రకటించాయి. ఇది పరోక్షంగా ఓటింగ్‌లో బీజేపీ సర్కారుకు లాభించేదే. రాజ్యసభలో బిల్లుకు కృత్రిమంగా బీజేపీ మెజారిటీ సాధించిందని, అయినా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లు విషయంలో అనుకూల, వ్యతిరేక పార్టీలివే..

అనుకూల పార్టీలు... వ్యతిరేక పార్టీలు
బీజేపీ కాంగ్రెస్‌
బిజూ జనతా దళ్‌ (బీజేడీ) నేషనల్‌ కాన్ఫరెన్స్‌
వైఎస్సార్‌సీపీ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ
బీఎస్పీ జనతా దళ్‌ (యునైటెడ్‌)
టీఆర్‌ఎస్‌ ఆర్జేడీ
శివసేన టీఎంసీ
ఆప్‌ డీఎంకే
టీడీపీ సీపీఎం
శిరోమణి అకాలీ దళ్‌ ఎండీఎంకే

లోక్‌సభకు ముందుకు బిల్లు
జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ ముందుకు కూడా వచ్చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యుల నిరసనల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లాంఛనంగా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఆర్టికల్‌ 370ను రద్దుపై ఆయన లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఇక, కశ్మీర్‌ విభజన బిల్లుపై మంగళవారం పూర్తిస్థాయిలో లోక్‌సభ చర్చించనుంది.

కశ్మీర్‌ రెండుగా విభజన..
ఆర్టికల్‌ 370పై పక్కా వ్యూహాన్ని అమలు చేసిన అమిత్‌ షా.. ముందుగానే బిల్లుకు సంబంధించిన వాటిపై పూర్తి కసరత్తు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజన చేస్తూ.. మరో బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం లడఖ్‌ను పూర్తిస్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా కానుండగా.. చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ కానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top