కేసీఆర్‌కు మాట తప్పడం అలవాటైంది: కిషన్‌రెడ్డి

 bjp leader kishan reddy slams cm kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు 50 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం 16 రోజులకే ముగించేందుకు ప్రతిపక్షాలతో సంప్రదింపులు చేస్తున్నారని శాసనసభలో బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సమావేశాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సభలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగిడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. ముఖ్యమంత్రి నిజాంను పొగిడారని ఎద్దేవా చేశారు. నిజాం చరిత్రను తిరగరాస్తానని సీఎం శాసనసభలో ప్రకటిస్తే మరోవైపు మజ్లిస్ పార్టీ సీఎంను పొగిడిందన్నారు. నిజాం చరిత్ర నేటితరానికి తెలియాలంటే ఆనాడు తెలంగాణ ప్రజలు, రైతులపై నిజాం ప్రభుత్వం సాగించిన దోపిడీ, దాష్టీకాల గురించి, నిజాం రజాకార్లను ఎదిరించేందుకు ప్రజలు నిర్మించుకున్న బురుజుల గురించి కూడా సీఎం తాను రాయించబోయే చరిత్రలో పొందుపర్చాలని కోరారు.

ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని చెప్పారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోందన్నారు. రాష్ట్రంలో 14 నెలలుగా జిల్లా పరిషత్ సమావేశాలు జరగడం లేదని తాను ఆరోపిస్తే కేంద్రం నిధులివ్వడం లేదని కేంద్రంపై మోపే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న 14 వ ఆర్థిక సంఘం నిధుల్ని కూడా వినియోగించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం శాసనసభను తమ పార్టీ ప్రచార వేదికగా తయారు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి మాట తప్పడం అలవాటుగా మారుతోందని, దళిత సీఎం హామీ నుంచి ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి లేఖ రాస్తానన్న హామీ వరకు ఇది నిరూపితమైందని ఆయన అన్నారు.

కనీసం బీఏసీ సమావేశం నిర్వహించకుండా శాసనసభ సమావేశాలు వాయిదా వేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 34 రోజులు నిర్వహించాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రతిపక్ష నేతల సంతకాలతో కేంద్రానికి సీఎం లేఖ రాస్తానన్నారు కానీ మా సంతకాలు లేకుండానే సీఎం కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం ప్రతిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణపై ఒత్తిడి తేవాలని కోరారు. కాగా, రాణి పద్మావతి సినిమా దర్శకుడు చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు. ఆ సినిమాపై రాజపుత్ర సంఘాల అభ్యంతరాలను దర్శకుడు పరిగణనలోకి తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top