‘ముష్టి అన్న పార్టీ.. ఎలా ముద్దు అయింది’

BJP K Laxman Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌ బీజేపీ కేంద్ర నాయకులపై, బీజేపీపై చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయన్నారు. కేటీఆర్‌, కేసీఆర్‌ల వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. వారిద్దరు ఏదో చెప్తూ .. నీతులు వల్లించినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నంబర్‌ వన్‌ అని  చెప్తున్నారని.. అది ఎందులోనో చెప్పడం లేదన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడంలోనా.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలోనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  సెక్రటేరియట్‌కు రాకుండా ప్రగతి భవన్‌కు పరిమితమైన కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం దారుణమన్నారు.

కేసీఆర్‌ ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్నాడని.. కానీ బొంగరం కూడా తిప్పలేరని విమర్శించారు. అన్ని అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్తున్న కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటున్నారని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరంపై టీఆర్‌ఎస్‌ వైఖరి ఎంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మజ్లిస్‌ను ముష్టి పార్టీ అన్నా టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు అది ఎలా ముద్దు అయిందో చెప్పాలన్నారు. రేపు లేదా ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణకు సంబంధించిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని వెల్లడించారు. మోదీ చరిష్మాకు భయపడి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఉన్నా ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదని.. జాతీయ పార్టీల మద్దతు, చొరవతోనే తెలంగాణ కల సాకరమైందని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top