రేవంత్‌ మాటలన్నీ అబద్ధాలే!

balka suman on revanth reddy - Sakshi

టీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్, భానుప్రసాద్, బాలరాజు

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి విద్యుత్‌ రంగంపై అమరవీరు ల స్థూపం సాక్షిగా అబద్ధాలు చెప్పి వారి త్యాగాలను కించ పరచారని, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా చంద్రబాబు పార్టీ భాషే మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం 2 కన్నా ఎక్కువ ఒప్పందాలు కుదుర్చుకుంటే రేవంత్‌ బయట పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీహెచ్‌ఈఎల్‌ ఝార్ఖండ్‌లో నిర్మిస్తున్న విద్యుత్‌ ప్రాజెక్టు వ్యయం కంటే రాష్ట్ర ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో నిర్మిస్తోందన్నారు. ఏపీ కన్నా రాష్ట్రం ఎక్కువ ధరలకు కరెంట్‌ కొనుగోలు చేయలేదన్నారు.  

అది కాంగ్రెస్‌ గొప్పతనం కాదు!
రేవంత్‌ చెబుతున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్‌ ఇస్తామని తెలంగాణకు లేఖ రాయలేదని చెప్పారు. విభజన చట్టంతో తెలంగాణకు 53 శాతం విద్యుత్‌ వాటా దక్కడం కాంగ్రెస్‌ గొప్పతనం కాదని, 2008లోనే విద్యుత్‌ కేటాయింపులు జరిగాయన్న సంగతి రేవంత్‌ గుర్తుంచుకోవాలన్నారు.

రేవంత్‌ చెప్పినవన్నీ అబద్ధాలని డాక్యుమెంట్లతో సహా నిరూపించామని, ఆయన తన వాదనను నిరూపించే ఒక్క డాక్యుమెంట్‌ కూడా చూపెట్టలేదన్నారు. ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు బీజేపీ ఎంత కమీషన్‌ ఇచ్చిందో రేవంత్‌ చెప్పాలని, కాంగ్రెస్‌ నేత సుబ్బరామిరెడ్డికి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఎంతిచ్చారో ఆయనతో చెప్పించాలని సవాలు చేశారు. 24గంటల కరెంట్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి బఫూన్‌లా ముందుకొచ్చారని విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top