ఒకే ఒక్కడు! | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు!

Published Tue, Mar 19 2019 12:12 PM

Asaduddin Owaisi Nomination Hyderabad Lok Sabha Place - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ తొలిరోజు గ్రేటర్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకే ఒక నామినేషన్‌ దాఖలు కావడం గమనార్హం. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయగా... మిగతా మూడు నియోజకవర్గాలైన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ వేయలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్థానాలకు హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో, మల్కాజిగి రి స్థానానికి కీసరలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం లో, చేవెళ్ల స్థానానికి రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.

అయితే  హైదరాబాద్‌ స్థానం నుంచి అసదుద్దీన్‌ నామినేషన్‌ వేయగా, మిగతా మూడు నియోజకవర్గాల్లో ఎవరూ నామినేషన్‌ వేయకపోవడం గమనార్హం. ప్రధాన పార్టీలు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడం, అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తుండడంతో నామినేషన్ల పర్వం నెమ్మదిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19, 25 తేదీల్లో తారా బలం కలిసొస్తుందన్న విశ్వాసంతో... ఆ రోజుల్లోనే నామినేషన్‌ దాఖలు చేసేందుకు కొందరు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రకటనపై ఈ నెల 22 వరకు సస్పెన్స్‌ కొనసాగనుందని విశ్వసనీయంగా తెలిసింది. విపక్ష కాంగ్రెస్‌లో చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి రేవంత్‌రెడ్డిల అభ్యర్థిత్వం ఖరారైంది. సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఇక బీజేపీ అభ్యర్థుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

Advertisement
Advertisement