96వ రోజు పాదయాత్ర డైరీ

96th day padayatra diary - Sakshi

24–02–2018, శనివారం
టకారిపాలెం, ప్రకాశం జిల్లా

స్థిరంగా నిలబడి.. తలెత్తి చూడలేని దైన్యం వారిది
ఈ రోజు పాదయాత్ర అంతా సాగు నీరందని రైతన్నల వ్యథలు, ఫ్లోరైడ్‌ పీడిత ప్రజల కన్నీటి కథల ప్రతిధ్వనుల మధ్యనే సాగింది. సరిగ్గా చెప్పాలంటే.. కనిగిరి నియోజకవర్గమంతా సాగునీటికి, తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రాంతం. సాగునీటి సమస్యతో చేలన్నీ బీళ్లవుతున్న దృశ్యాలొక వైపు, తాగునీరే విషమవుతున్న విషాదఛాయలు మరోవైపు.. మనసును తీవ్రంగా కలచివేశాయి. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఫ్లోరైడ్‌ ప్రభావిత జిల్లా ప్రకాశం. ఈ జిల్లాలోనే అతి ఎక్కువ పీడిత ప్రాంతం కనిగిరి. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్లోరైడ్‌ సమస్యతో కిడ్నీ పేషెంట్లయిన వాస్తవాలు కనిపిస్తాయి.

వంకరపోయిన కాళ్లూచేతులు, దంతాలపై గార, వెన్ను, మెడ నొప్పులు, కిడ్నీ సమస్య, పెళుసుబారిన ఎముకలు.. ఫ్లోరైడ్‌ సమస్యతో ప్రజల్లో ఈ కష్టాలన్నీ తలెత్తుతున్నాయి. ఈ రోగగ్రస్తులు ఆకాశం కేసి చూడాలన్నా, ఎగిరెళ్లే విమానాన్ని చూడాలన్నా పడుకుని చూడాల్సిన పరిస్థితిని అక్కడ ఒకాయన చెబితే.. దేవుడా! అనిపించింది. అవును మరి.. స్థిరంగా నిలబడి తలెత్తి చూడలేని దైన్యం వారిది. చిన్న వయసులోనే వృద్ధాప్యఛాయలు కమ్ముకుంటుంటే.. పాలకుల నిర్లక్ష్యం వారికెంత శాపమైందనిపించింది. ఇక్కడ వీరి కష్టాలు చూసి చలించిపోయిన నాన్నగారు.. ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీరు, తాగునీరు అందించాలని తపించారు. రామతీర్థ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను ప్రారంభించి, ఆయన హయాంలోనే పూర్తిచేశారు. కనిగిరి సమగ్ర రక్షిత మంచి నీటి పథకం ఆయన చలవతో రెండు దశలు పూర్తిచేసుకుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, ఈ నాలుగేళ్లలో ఒక్కపనీ మొదలుపెట్టలేదు. ఒక్క రూపాయీ శాంక్షన్‌ చేయలేదు.. ఎంత బాధాకరమో!

కిడ్నీ బాధితుల సమస్యలకు చలించి నేను కూడా ఈ ప్రాంతానికొచ్చి ధర్నా చేశాను. అప్పుడు కదలిక వచ్చిన ప్రభుత్వం.. ఐదుచోట్ల మొక్కుబడిగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంది. వాటి నిర్వహణను గాలికొదిలేసింది. ఈ ప్రభుత్వానికి పేదలన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేనితనం. అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే ఇక్కడి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబుగారు.. ఇప్పుడు ఆ మాటే మరిచారని ఇక్కడి ప్రజలు బాధపడ్డారు. ‘నాన్నగారు ఉంటే వెలుగొండతో సహా మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. మా బాధలు తీరేవి’అని చెప్పారు. ‘మీ వల్ల కనీసం డయాలసిస్‌ కేంద్రాలొచ్చాయి.. అందుకు కృతజ్ఞతలు సార్‌’అని నాతో అక్కడివారంటుంటే.. వీళ్లకు ఫ్లోరైడ్‌ నుంచి శాశ్వతంగా విముక్తి కల్గించాలి.. ఫ్లోరైడ్‌ రహిత ప్రకాశం జిల్లానే నా ధ్యేయం.. అని మనసులో గట్టిగా తీర్మానించుకున్నాను.

ఈ రోజు ఉదయం బత్తాయి, నిమ్మ పండ్ల రైతులు కలిశారు. ‘ఇంతకు ముందు పండ్ల తోటలు లాభదాయకంగా ఉండేవి. కానీ, గత నాలుగేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా తోడైంది. జీవితకాలం ఆధారంగా ఉంటాయన్న నమ్మకంతో పండ్ల తోటలు వేసుకున్నాం. వర్షాల్లేక, బోర్లలో నీళ్లు సరిపోక చెట్లు చచ్చిపోతున్నాయి. తోటలకు తోటలే నాశనమైపోతున్నాయి’అని ఆ రైతన్నలు బాధపడిపోతుంటే.. అసలు రైతులకే ఇన్ని కష్టనష్టాలెందుకు? అనిపించింది. ‘ఇంత ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు’అని వారు చెబుతుంటే.. ప్రజా సమస్యలకన్నా ముఖ్యమైన విషయాలు ఈ పాలకులకేం ఉంటాయో.. అని ఆశ్చర్యం అనిపించింది. ఇలా సాగు, తాగు నీరు లేక, బతుకో జీవన్మరణ సమస్యగా తయారవుతుంటే, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తిచేయాల్సింది పోయి.. వాటిని గాలికొదిలేసిందీ ప్రభుత్వం. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గ్రామానికి, పట్టణానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ క్యాన్, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం, సముద్ర జలాలను శుభ్రపరిచి మంచి నీటిగా మార్చగల డిశాలినేషన్‌ ప్లాంట్లను మంజూరు చేస్తామంటూ మీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారు కదా.. అవేమైనా గుర్తున్నాయా? వాటిలో ఏ ఒక్కటన్నా నెరవేర్చి ఉంటే.. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇంత దీనావస్థలో ఉండేదా? 
- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top