92వ రోజు పాదయాత్ర డైరీ

92nd day padayatra diary - Sakshi

19–02–2018, సోమవారం
విప్పగుంట, ప్రకాశం జిల్లా

హెరిటేజ్‌ కోసం పలు సహకారరంగ డెయిరీలను బలిపెట్టారు
ఈరోజు ఉదయం ఇద్దరు అక్కాచెల్లెళ్లు నాతో చెప్పిన మాటలు నా మనసును కలచివేశాయి. వెంకటాద్రిపాలేనికి చెందిన గురజాల రాణి, రిబ్కా అక్కాచెల్లెళ్లు. వాళ్ల నాన్న జబ్బుచేసి చనిపోయాడట. అండగా ఉంటాడనుకున్న అన్న యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడట. ఆ చావుల బాధను, పిల్లల కష్టాలను భరించలేక అమ్మ మనోవేదనతో కుంగి కృశించిపోయి గుండెపోటుతో మరణించిందట. ఇద్దరు ఆడబిడ్డలూ అనాథలయ్యారు. ఇన్ని కష్టాలలోనూ అక్క 85శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసిందట. పైచదువులు చదవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక రాజీపడిపోయిందట. టీటీసీ చదువుకుంటున్న చెల్లెలి చదువు కొనసాగాలంటే తను కూలో, నాలో చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇస్తానన్న ఉద్యోగం గానీ, నిరుద్యోగ భృతిగానీ రాలేదేంటన్నా..? అంటూ అమాయకంగా అడిగింది. ఆ బిడ్డలిద్దరు తమ బాధలు చెబుతున్నప్పుడు గుండె బరువెక్కింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెమ్మల్లానే రాష్ట్రంలోని కోట్లాది మంది యువత బాబుగారిచే వంచించబడ్డారు. 

కొద్దిదూరం ముందుకెళ్లగానే.. ఉపాధి హామీ పథకంలో పనుల కోసం వెళ్లి, పని ప్రదేశంలోనే గాయపడి, ఒక కాలును పోగొట్టుకున్న ఎడ్లూరుపాడుకు చెందిన యలమందయ్య కలిశాడు. ఏడాది కిందట ఆయన ఉపాధి పనులకెళ్లినప్పుడు గాయపడ్డాడట. పని ప్రదేశంలో అనారోగ్యానికి లోనైనా, ప్రమాదానికి గురైనా.. వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని పార్లమెంటు ఆమోదించిన చట్టమే చెబుతోంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అతడి వైద్యం గురించి పట్టించుకోలేదట. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో పాపం ఆ పెద్దాయన  చేసేదిలేక లక్షా ఇరవై వేల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకున్నాడట. సమయానికి డబ్బు సమకూరక, వైద్యం ఆలస్యం కావడం వల్ల గాయం సెప్టిక్‌ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చిందట. ఇది చాలదన్నట్లు 80శాతం అంగవైకల్యం ఏర్పడిన ఆ వ్యక్తికి కనీసం పింఛన్‌ ఇచ్చిన పాపానపోలేదట. యలమందయ్య విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదలంటే లెక్కలేని తనం.. ఆ కుటుంబాన్ని అప్పులపాల్జేసి వీధిన పడేసింది. 

విప్పగుంట వద్ద పాడి రైతులు కలిశారు. నిత్యం కరువుకాటకాలతో సతమతమవుతూ వర్షాల్లేక పాడిపైనే ఆధారపడి బతుకుతున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో, రైతుల శ్రమతో ఏర్పడ్డ ఒంగోలు డెయిరీపై ఆధారపడి సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామన్నారు. 2014 వరకు ఆ డెయిరీ లాభాలబాటలో పయనించేదని, సకాలంలో చెల్లింపులుండేవని, బోనస్‌లు కూడా ఇచ్చేవారని అన్నారు. ఆ డెయిరీ సహకారంతో గేదెల కొనుగోలుకు బ్యాంకు రుణాలు కూడా పొందామని చెప్పారు. కానీ, 2014లో బాబుగారి పాలన వచ్చాక ఒక్కసారిగా డెయిరీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, నెలల తరబడి చెల్లింపులే లేవని అన్నారు. జిల్లాలో పాడిరైతులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.11 కోట్లు ఉన్నాయట. ఇదే అదునుగా ప్రయివేటు డెయిరీలు కుమ్మక్కై రైతులకిచ్చే ధరను తగ్గించేసి దారుణంగా దెబ్బతీశాయన్నారు. అటు వ్యవసాయం చేసుకోలేక, ఇటు పాడిపై ఆధారపడి బతకలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని, వలసలే శరణ్యమని వాపోయారు. బాబుగారు ఇప్పటికే చిత్తూరు సహా పలు సహకార రంగ డెయిరీలను తన సొంత డెయిరీ హెరిటేజ్‌ కోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఒంగోలు డెయిరీ వంతు రావడం నిజంగా బాధేస్తోంది. 

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. లాభాల బాటలో సాగుతున్న ఒంగోలు డెయిరీ.. మీరు అధికారం చేపట్టగానే ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి ఎలా వెళ్లింది? మీ అనుకూల పాలకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఒంగోలు డెయిరీని నష్టాల ఊబిలోకి నెట్టి పాడి రైతుల పొట్టగొట్టడం న్యాయమేనా? మీరు పాలన చేపట్టగానే ఒంగోలు డెయిరీతో సహా రాష్ట్రంలోని అన్ని సహకార డెయిరీలు అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లడం, హెరిటేజ్‌ డెయిరీ మాత్రం అంతకంతకూ లాభాల బాట పట్టడం వాస్తవం కాదా?
-వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top