జాతి కోసం తపించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

జాతి కోసం తపించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి - Sakshi


సందర్భ రచయిత:  ‘ముందు గ్రంథాలు పట్టు, తపస్సు చెయ్యి, ఆ తరువాత కలం పట్టు’ అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సాహితీ రంగంలో కృషి చేసే యువకులకు చేసిన హెచ్చరిక ఇది గ్రంథాలు చదివితే పదసంపద పెరుగుతుంది. గ్రంథాలు బుద్ధికి మారాకు పట్టిస్తాయి. జ్ఞానాన్ని గురించి ఆవేదన కలిగిస్తాయి అన్నది శ్రీపాదవారి విశ్వాసం. లోకుల సంభాషణలు వింటూ ఉండడమూ, గ్రంథాలు చదువుతూ వుండడమూ, ఎడతెగకుండా రచనలు సాగిస్తూ వుండడమూ- ఈ విధంగా భాషాజ్ఞానం సంపాదించాలి కవి అంటారాయన. శ్రీపాద దృష్టిలో రచన అనేది ఒక తపస్సు. కవి సమాధిలో కూచున్నాడా సరియైన తాదాత్మ్యం సిద్ధించిందా ఇక అతనికి భోగాల మీదికి దృష్టి పోదు. కష్టాలు కనబడవు. రచనలో మునిగిన కవి మానసిక స్థితి అలా ఉంటుంది అంటారాయన. కవి హృదయం అతి సున్నితమట. సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతడు చూడగలడట. ఆ ఆనందం పరులు కూడా పొందాలని అతడు కావ్యం రచిస్తాడని శాస్త్రిగారు కావ్య సృష్టిలోని పరమార్థాన్ని చెప్పారు.

 

 కథా రచయితగా ప్రఖ్యాతి పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత,  చరిత్రలు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు- ఇలా అన్ని ప్రక్రియలూ చేపట్టి ఓహో అనిపించుకున్నారు. వ్యాఖ్యానాలు రాశారు. అవధానాలు చేశారు. ప్రబుద్ధాంధ్ర అనే పత్రిక స్థాపించి సంపాదకత్వం వహించారు. గంధర్వ ఫార్మసీ స్థాపించి ఆయుర్వేదం మందులు తయారు చేశారు. కళాభివృద్ధినీ పరిషత్ ఏర్పాటు చేసి సాహితీ సభలూ, సన్మానాలూ నిర్వహించారు. నాటకాలు ఆడారు. సంగీతంపై అభిమానంతో వయోలిన్ నేర్చుకున్నారు. నిజాయితీ, నియమబద్ధతా, నిష్కర్ష ఆయనకు సహజ గుణాలు. దేనిలోనూ రాజీ ఉండదు. ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ పేరుతో రాసిన వారి ఆత్మకథ ఎన్నో  ప్రశంసలు అందుకుంది. అన్నింటినీ మించి ఆయనకు  తెలుగుజాతి అన్నా అభిమానం ఎక్కువ. ఏమాత్రం కల్తీలేని అసలు సిసలైన తెలుగు రచయిత ఆయన.

 

 సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని పొలమూరులో 1891 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. స్వగ్రామం మహేంద్రవాడ. వారిది వైదిక నిష్టాగరిష్టమైన కుటుంబం. ఎన్నో నియమాలు. సంస్కృతమే తప్ప తెలుగు గ్రంథాలు ముట్టడానికే వీలులేదు ఆ కుటుంబంలో. క్రాపింగుతో ఉండాలని సరదా ఆయనకి. పనికిరాదంటారు కుటుంబసభ్యులు. చొక్కా తొడుక్కోవాలని ఉబలాటం. పనికిరాదంటారు పెద్దలు. దీంతో కుటుంబ సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు శాస్త్రిగారు. ఈ లక్షణమే వారి రచనల్లో దర్శనమిస్తుంది. వరకట్నం, అస్పృస్యత వంటి దురాచారాలపై దాడి కనిపిస్తుంది. మహిళలపై సానుభూతి చోటుచేసుకుంటుంది.

 నా తెలుగుపై నాకు నిషేధం ఏమిటీ? అనుకుని ఓం ప్రథమంగా నన్నయ భారతాన్ని తెరిచారు. తెలుగు గడ్డపైనే తెలుక్కి అన్యాయం జరుగుతోందని చిన్నప్పుడే ఆయన తెలుసుకోగలిగారు.

 ఇదే తెలుగు సాహిత్యానికి ఆయన్ని అంకితం చేసింది. తెలుగుభాషకూ, తెలుగు జాతికీ జరుగుతున్న అపకారాన్ని శాస్త్రిగారు ఎదిరించారు. తమ ప్రబుద్ధాంధ్ర పత్రికద్వారా పోరాటాలే జరిపారు. గ్రాంథికం నుంచి వ్యావహారికభాషకు మళ్ళి దానికి అండగా నిలిచారు. వ్యావహారికభాష తియ్యదనాన్ని రుచి చూశారు. రచనల ద్వారా రుచి చూపించారు.

 

 తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి: ‘‘ నా తెనుగు భాష శాస్త్రీయం, తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహినిగా వుండినదిగాని, యివాళ ఆ భాషలోంచి వొక మాటా యీ భాషలోంచి ఒక మాటా యెరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగు సరప్వతికే తేనె చినుకు లందించిందిగాని నిరుచప్పనిది కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలిగిందిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందికాదు. అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీకాదు’’.

 

 తెలుగు మాగాణి నాలుగు చెరగులా తిరిగి అక్కడక్కడి పలుకుబళ్లు ఒంట బట్టించుకున్నాక తనకు ఐదు ప్రాణాలూ సంక్రమించినట్టు అయిందంటారు శ్రీపాదవారు. తన ప్రాంతపు పలుకుబడిలో యెంత శక్తి వుందో అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తీ వుంది అంటారు ఆయన. ఒక్కొ సీమలో ఒక్కొక్క జీవకణం ఉందట. అన్నీ ఒకచోటికి చేర్చగల, అన్నీ ఒక్క తెనుగు రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకురావాలి అని అసలు విషయం వెల్లడించారు. అవునుకదా, నిజానికి ఇప్పుడదే జరగాలి.

 మాతృభాషపట్ల చిన్నచూపు పనికిరాదంటూ తల్లిభాష విడిచి ఇతర భాష నేర్చుకునేవాడూ తల్లిభాషలో కాక ఇతర భాషల్లో మాట్లాడేవాడూ తల్లిభాషలోకాక ఇతరభాషలో ఆనందించేవాడూ- తల్లి లేని బిడ్డ అంటారు. శ్రీపాదవారి దృష్టిలో తెలుగుదేశమే దేశం. తెలుగుభాషే భాష. తెలుగు మనుషులే మనుషులు. తెలుగు వేషమే వేషం. ఇది కొంచెం తీవ్రంగా తోచినా కచ్చితంగా వాస్తవం. విదేశీయులు సైతం అంగీకరించిన పరమ సత్యం. ఇప్పటి మన దయనీయమైన పరిస్థితికి నేను ఆంధ్రుణ్ణి అనే భావన బొత్తిగా లేకపోవడమే కారణం. కాబట్టి అలా భావించడం చాలా అవసరం.

 ‘భారత దేశం అంతా వీరవిహారంగా చేసుకుని, మహాసామ్రాజ్యాలు నిర్మించి, అనేక ప్రాంతాలవారిని పరిపాలించి, - అయ్యో! నేడు భృత్యునిగా, అనుచరునిగా, మట్టి తలకాయవానిగా యాసడింపబడుతున్నానే’ అనే అవేశం కలిగించాలి.

 అంతేకాదు ‘నే నాంధ్రుణ్ణి. నా పూర్వుల రక్తమే నన్ను నడిపిస్తోంది. భరతవర్షానికి నేను ప్రవర్తకుణ్ణి. ప్రపంచానికి నేను ఆదర్శ పురుషుణ్ణి అని చెప్పుకోగలగడమే పరమావధి’ అని కూడా శ్రీ పాదవారు ఉద్భోదించారు.

 ఈ పరిస్ధితుల్లో చేయవలసిందాన్ని శాస్త్రిగారు సూచించారు. ‘తెలుగులో విజ్ఞానం కలిగించే వాఞ్మయం నిర్మించాలి . నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే ఉపన్యాసం చెయ్యాలి. నడుంకట్టితే ఫలితం యిచ్చే కార్యక్రమం నెరవేర్చాలి. ఇది ప్రయోజనకరమైన సందేశం?

 ఏ జాతి ఎదటా ఏ సందార్భంలోనూ ఎందుకున్నూ నా తెలుగుజాతి తీసిపోదు. అంచేత ప్రపంచానికిది ఉద్ఘాటించడానికి నా సేవలు జాతికే మీదు కట్టుకోవాలి నేను అని శ్రీపాదవారు ప్రతిజ్ఞలాంటిదే చేశారు. దానికి కట్టుబడి కృషి చేశారు కూడాను.

 అయితే, చేయవలసింది ఇంకా ఉండగానే తెలుగుజాతి దురదృష్టంవల్ల శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1961 ఫిబ్రవరి 25  మరణించారు. ఆంధ్రజాతి అభ్యుదయం కోసం తపించే ఒక పెద్ద అండ కరువైంది. వారికి నిజమైన నివాళులు అర్పించుకోగలగడం మన విధి.        

 - పున్నమరాజు నాగేశ్వరరావు

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top