మరో మొహెంజొదారో ప్రయోగాలకు నాంది

మరో మొహెంజొదారో ప్రయోగాలకు నాంది - Sakshi


50 ఏళ్ళ నాటకం: తెలుగు నాటకాన్ని  ప్రయోగ ధోరణి వైపు వడిగా అడుగులేయించిన నాటకం ‘మరో మొహెంజొదారో’. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం కూడా అని ఆ రోజులలో ఒక పత్రిక రాసిందట. నిజమే. జోడుగుళ్లు ఒకేసారి పేల్చినట్టు రచయిత ఎన్‌ఆర్ నంది ఈ నాటకంలో ఒకేసారి రెంటినీ సాధించారు. 1964లో మొదటి ప్రదర్శన నోచుకున్న సందర్భంగా...  

 

 ‘మరో మొహెంజొదారో’ను ఆచార్య ఆత్రేయకు అంకితమిచ్చారు నంది. మన సాంఘిక నాటకానికి కొత్త దృష్టిని ఇచ్చినవాడు ఆయనే. ఆత్రేయ రాసిన ‘ఎవరు దొంగ’ అన్న నాటికలో ఒక పాత్ర ప్రేక్షకుల మధ్య నుంచి రంగస్థలం మీదకు వెళుతుంది- ప్రశ్నిస్తూ. రెండవ ప్రపంచ యుద్ధానంతర దారుణ దృశ్యాలతో ఆయన రాసిన ‘విశ్వశాంతి’ నాటకంలో అంతర్నాటకంతో పాటు, నీడలతో కథను నడపడం వంటి కొత్త పోకడలు కొన్ని కనిపిస్తాయి. ఇలాంటి ఆధునిక దృష్టికే నంది ‘మరో మొహెంజొదారో’లో పట్టం కట్టారు. ఈ నాటకం మీద కొందరు చేసిన వ్యాఖ్యలు నందిని ఎంత బాధించాయో ముందుమాట చదివితే తెలుస్తుంది. కానీ నాటకం చదివిన తరువాత ఆ వ్యాఖ్యలు చేసినవారు అర్థం కాక చేసి ఉండాలి, లేదా కొత్తదనాన్ని స్వాగతించడానికి సిద్ధంగా లేనివారెవరో చేసి ఉంటారని అనిపిస్తుంది.

 

 ఇది యాభయ్ సంవత్సరాల క్రితం రాసిన నాటకం. కానీ ఇప్పుడు చదువుకున్నా ఆ అనుభూతి తాజాగానే ఉంటుంది. నంది తీసుకున్న ఇతివృత్తం సార్వకాలికమైనది. మనుషులలోనే కనిపించే దోపిడీ తత్వం, అలాంటి అవ్యవస్థను నిర్మూలించడానికి మళ్లీ మనిషి పడే తపన ఇందులో చిత్రించారాయన. చారిత్రక దృష్టి, తాత్విక చింతనలతో గాఢంగా ముడిపడి ఉన్న అంశమిది. వీటి వల్ల సాధారణంగా నాటక ప్రక్రియకు ఏ మాత్రం సరిపడని ఉపన్యాస ధోరణి చొరబడుతుంది.

 

 నాటకానికి ప్రయోక్త పాత్రను కూడా నిర్వహించిన ‘శాస్త్రజ్ఞుడు/ప్రొఫెసర్’ పాత్రలో కనిపించేది ఈ ధోరణే. ఇంత సుదీర్ఘమైన చరిత్రను చూస్తుంటే చరిత్ర నుంచి మనిషి ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తుంది అంటాడొక చరిత్ర తత్వవేత్త. ఇందులో శాస్త్రజ్ఞుడు కూడా ప్రకృతితో సమరం చేసిన మనిషి నాగరిక సమాజాన్ని రూపొందిస్తున్నానని అనుకుంటూనే అనేక తప్పులు చేశాడు అంటాడు. వాటిని సరి చేయడానికి మళ్లీ ఎన్నో సమరాలు, విప్లవాలు అవసరమయ్యాయని గుర్తు చేస్తాడు. రకరకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చి నది ఆ క్రమంలోనే అంటాడు.  ఈ సంఘర్షణలోనే నాగరికతలు పుట్టాయి, గిట్టాయి అన్నదే ఆ ప్రొఫెసర్ సిద్ధాంతం.  ఇలాంటి ఉపన్యాస ధోరణిని తన ఇతివృత్తాన్ని ఆవిష్కరిం చడానికి చక్కగా ఉపయోగించుకోవడంలోనే నంది నే ర్పరితనం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ కవితలో పంక్తులను రచయిత విరివిగా ఉపయోగించు కున్నారు. ఇవన్నీ కలసి మంచి ప్రయోగాత్మక నాటకాన్ని తెలుగు వాళ్లకి అందించాయి.

 

 తన ప్రయోగశాలలోని కొన్ని పరిశోధక గ్రంథాలను శాస్త్రజ్ఞుడు మనకు పరిచయం చేయడం దగ్గర నాటకం ఆరంభమవుతుంది. నిజానికి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క జీవితం. ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించే జీవితమది. పాత్రల పేర్లు కూడా ఆయా వర్గాలనే ప్రతిబింబిస్తుంటాయి. అవి- భిక్షాలు (పేద), పరంధామయ్య (మధ్య తరగతి), భూషణ్(తిరుగుబాటు ధోరణి), కోటీశ్వరయ్య (ధనికుడు), లాయర్, డాక్టర్ (చదువుకున్న వర్గం), తులసి (బలి పశువు). పేదవాడు మరింత పేదవాడు అవుతుంటే, ధనికుడు మరింత ధనవంతుడవుతున్నాడని ప్రొఫెసర్ ప్రకటించి భిక్షాలును పలకరిస్తాడు. భిక్షాలు ఇప్పుడు కూలి. కానీ అతడి తండ్రి రైతు. ఈ పరిణామం ఏం మారింది? ఇలా ఒక్కొక్క పాత్రను మొదట పరిచయం చేసి నెమ్మదిగా ప్రొఫెసర్ వేదికను అసలు పాత్రలకు విడిచి పెడతాడు.

 

 కానీ ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు పుట్టుకు రావలసి వచ్చిందో భూషణ్ పాత్ర ద్వారా చాలా చక్కగా ఆవిష్కరించారు నంది. మార్పును కోరే విప్లవకారులు ఎన్నయినా చెప్పవచ్చు. కానీ వాళ్ల అభ్యుదయం మాటున ఎక్కడో ఒకింత పిడివాదం దాగి ఉందన్న విషయాన్ని కూడా రచయిత విడిచి పెట్టలేదు. మధ్య తరగతిలో ఉండే అవకాశవాద ధోరణిని పరంధామయ్యలో చూస్తుంటే జాలి కలుగుతుంది. చివరికి భూషణ్ లేవదీసిన విప్లవానికి వెన్నుపోటు పొడిచేది కూడా ఇతడే. కానీ కోటీశ్వరయ్య చ నిపోయేది కూడా ఇతడి చేతులోనే. నిజానికి ఇది 1963  ప్రాంతంలో వచ్చిన రచన. తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది.

 

 మరో మొహెంజొదారో అంటే మరో మట్టి దిబ్బ. గొప్ప నాగరికత అవశేషం. ఆ సమాజం వరదలతోనో, మరో ఉత్పాతంతోనో ధ్వంసమైంది.  ఇప్పటి సమాజం కూడా అనేక తప్పిదాలతో  మరో మొహెంజొదారోను పునరావృతం చేయడానికి తొందరపడుతోందంటూ రచయిత చేసిన హెచ్చరికే ఈ నాటకం.

 

 ప్రయోగ దృష్టి నంది తరువాత వచ్చిన నాటకకర్తలలో కూడా కనిపిస్తుంది. ఆశ ఖరీదు అణా (గోరా శాస్త్రి), రాజీవం (కేవీఆర్, వేణు), మళ్లీ మధుమాసం (గణేశ్‌పాత్రో), త్రిజాకీ యమదర్శనం (అబ్బూరి గోపాలకృష్ణ), కుక్క (యండమూరి), ఓ బూతు నాటకం (ఇసుకపల్లి మోహనరావు), కొక్కొరోకో, గార్దభాండం (తనికెళ్ల భరణి), పెద్ద బాలశిక్ష (ఆకెళ్ల), పడమటిగాలి (పాటిబండ్ల ఆనందరావు) వంటి వాటిలో  ప్రశంసనీయమైన ప్రయోగధోరణులు కనిపిస్తాయి.  

 - గోపరాజు నారాయణరావు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top