కలసి నడుస్తున్న కర్షకులు

కలసి నడుస్తున్న కర్షకులు - Sakshi


విశ్లేషణ

ఇప్పటి రైతాంగ ఉద్యమాలన్నీ పంటలకు ప్రభుత్వం ప్రకటించిన వాస్తవ మద్దతు ధరను ఇవ్వడమే కాదు, ఇది అందరి రైతులకు కూడా ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు, రైతులు ఆశించిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి, ఆ లోటును కూడా ప్రత్యామ్నాయంగా చెల్లించాలని కూడా రైతాంగ ఉద్యమాలు అడుగుతున్నాయి. అలాగే రైతు రుణ విముక్తి అంటే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా పొందిన రుణం, లేదా గ్రామీణ సహకార బ్యాంకుల నుంచి పొందిన రుణాల నుంచి మాత్రమే కాదు.



ఉత్తర భారతదేశానికి చెందిన రైతు ఉద్యమ నాయకులు దక్షిణ భారతంలో తరచుగా పర్యటించడం ఎప్పుడైనా చూశామా? రైతాంగ ప్రతినిధులు, భూమి లేని వ్యవసాయ కార్మికులు కలసి ఉమ్మడిగా ఉద్యమించిన దృశ్యాన్ని గతంలో మనం ఎన్నిసార్లు చూశాం? రెండు అంశాల జాతీయ ఎజెండా మీద 150కి పైగా సంస్థలు ఏకతాటి మీదకు రావడం గతంలో ఎప్పుడు జరిగింది? కానీ ఈ వారంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలలో ఇదంతా వాస్తవ రూపం ధరించబోతున్నది. దేశం నలుమూలలా ఉన్న రైతాంగ సంస్థలు అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సంఘం పేరుతో ఒకే గొడుగు కిందకి వస్తున్నాయి. ఈ సంఘంలో పరస్పరం విభేదించుకునే రాజకీయ సిద్ధాంతాలకు సంబంధించిన రైతు సంస్థలు కూడా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంస్థలను ఈ సమన్వయ సంఘం ఒకచోటకు చేర్చబోతున్నది. అలాగే రకరకాల పంటలు పండించే రైతులు ఇందులో ఉంటారు. ఈ ఐక్యత ఇలాగే ఉంటే తమ డిమాండ్ల విషయంలో సంఘం తన గొంతును గట్టిగా వినిపించగలుగుతుంది.



ఇది కచ్చితంగా భారత రైతాంగ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించగలుగుతుంది. రైతులను ఒకే ఛత్రం కిందకు తీసుకురావడం కోసం సమన్వయ సంఘం దేశం నలుమూలలా యాత్రలను నిర్వహిస్తున్నది. మొదటి యాత్ర మొదలైంది కూడా. మధ్యప్రదేశ్‌లోని మాద్‌సౌర్‌లో ఆరంభమైన ఆ యాత్ర మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల గుండా ప్రయాణించింది. రెండో దశలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగ ప్రతినిధులు దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించారు.



కొత్త చైతన్యం

అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సంఘం పతాకం కింద నేడు (సెప్టెంబర్‌ 16) తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి యాత్ర ఆరంభం కానున్నది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌ (సెప్టెంబర్‌ 17,18), తమిళనాడు (సెప్టెం బర్‌ 19,20), కేరళ (సెప్టెంబర్‌ 21)లో పర్యటించి, చివరిగా కర్ణాటక (సెప్టెంబర్‌ 22,23) చేరుకుంటుంది. ఉత్తర భారతదేశంలో, అంటే యూపీ–బిహార్, తూర్పు– ఈశాన్య భారతాలలో కూడా ఇదే తరహాలో యాత్రలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నవంబర్‌ 20 నాటికి ఢిల్లీ చేరడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది. అప్పుడే కిసాన్‌ ముక్తి సన్సద్‌ కూడా నిర్వహిస్తున్నారు. సరిగ్గా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సమయానికి కార్యక్రమం పతాక సన్నివేశానికి చేరుకుంటుంది.



ఈ అసాధారణ ప్రయత్నం రైతాంగ ఉద్యమంలో ఒక కొత్త దశకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ కొత్త ఉద్యమం సంప్రదాయకంగా భూస్వాములకు, రైతులకు, కౌలు రైతులకు మధ్య భేదాన్ని తుడిచి వేస్తున్నది. లేదంటే వ్యవసాయ కార్మికుల ఐక్యత అన్న వామపక్ష నినాదం ఇప్పుడు రైతాంగ ఉద్యమంలో ప్రతి«ధ్వనిస్తున్నదని చెప్పవచ్చు. ఈ రైతాంగ ఉద్యమంలో దళితులను, ఆదివాసీలను కూడా భాగస్వాములను చేశారు. వీరిలో చాలావరకు వ్యవసాయ కార్యకలాపాలలో ఉండేవారే అయినప్పటికీ ఎప్పుడూ ప్రధాన స్రవంతి రైతాంగ ఉద్యమాలలో కనిపించేవారు కాదు. సేద్యంలో మూడింట రెండు వంతుల సేవ అందిస్తున్న మహిళా రైతాంగం ప్రాధాన్యాన్ని కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు.



సైద్ధాంతిక పరిభాషలో చూసినా కొత్త రైతాంగ ఉద్యమం పాత చీలిక విధానానికి దూరంగా ఉంది. గతంలో భూస్వాములు, భూమిలేని నిరుపేదలు అన్న విభజన ఉండేది. అయితే ఆర్థిక వ్యవస్థలో ఈ రెండు వర్గాలు బాధితులేనని ఈ విభజనే గుర్తించేటట్టు చేసింది. అలాగే పర్యావరణ సంక్షోభం రైతుల మీద, వారితో పాటు రైతులు కాని వారి మీద కూడా ఒకే విధంగా ప్రభావం చూపిందన్న వాస్తవాన్ని కూడా గమనంలోనికి వస్తున్నది. సిద్ధాంతపరమైన కాఠిన్యం నుంచి బయటపడడంతో రాజకీయ ఐక్యతకీ, విధానాల మీద దృష్టి పెట్టడానికీ అవకాశం ఏర్పడింది.



డిమాండ్లకు విస్తృతార్థం

ఒక ఉమ్మడి ఎజెండా మీద అన్ని రైతు సంఘాలు ఒడంబడికకు రావడం బహుశా ఇదే మొదటిసారి. న్యాయమైన గిట్టుబాటు ధరలు, రుణ విమోచన అనే రెండు అంశాల మీద సంఘాలన్నీ ఒక తాటి మీదకు వచ్చాయి. ఈ రెండు అంశాల సాధనకే తమ శక్తియుక్తులన్నింటినీ వినియోగించాలని సమన్వయ సంఘంలోని రైతాంగ సంస్థలే కాదు, బయట ఉండిపోయిన సంస్థలు కూడా అంగీకారానికి వచ్చాయి.



రైతు అనే పదానికి ఇచ్చిన విస్తృతార్థాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ రెండు డిమాండ్లకు కూడా సమగ్ర రీతిలో భాష్యం చెప్పారు. న్యాయమైన, గిట్టుబాటు ధరలు అంటే కనీస మద్దతు ధరకు, సేకరణకు పరిమితం చేయడం కాదు. వీటి వల్ల భారత రైతాంగంలో 1/10 వంతు కంటే తక్కువగా మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి రైతాంగ ఉద్యమాలన్నీ పంటలకు ప్రభుత్వం ప్రకటించిన వాస్తవ ధరను ఇవ్వడమే కాదు, ఇది అందరి రైతులకు కూడా ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు, రైతులు ఆశించిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి, ఆ లోటును కూడా ప్రత్యామ్నాయంగా చెల్లించాలని కూడా రైతాంగ ఉద్యమాలు అడుగుతున్నాయి. అలాగే రైతు రుణ విముక్తి అంటే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా పొందిన రుణం, లేదా గ్రామీణ సహకార బ్యాంకుల నుంచి పొందిన రుణాల నుంచి మాత్రమే కాదు. వడ్డీ వ్యాపారుల రుణాల నుంచి కూడా విముక్తం చేయాలని రైతులు కోరుతున్నారు. మౌలికమైన ఈ మార్పు అంతా మారిన కొత్త రైతు నాయకత్వంలో ప్రతిఫలిస్తున్నది.



ఈ నాయకత్వం గ్రామ ప్రాంతాలతో సంబంధం కలిగి ఉండి, పట్టణ వాతావరణం కూడా తెలిసినది. వీరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. కానీ పూర్తి సమయం సేద్యంలో ఉండేవారు మాత్రం కాదు. ఈ నాయకత్వం రైతు బాధలను అర్థం చేసుకోగలదు. అలాగే విధాన రూపకర్తల భాషను కూడా మాట్లాడగలదు. వీరు క్షేత్ర స్థాయిలో అలజడులు లేపుతారు. అదే సమయంలో సమాచార హక్కును, వ్యాజ్యాలను ఉపయోగించుకుంటారు. కొత్త రైతాంగ ఉద్యమానికి ఈ యువ నాయకత్వమే వెన్నెముక. మళ్లీ ఆ ప్రశ్నలు వేసుకుందాం. ఉత్తర భారత రైతాంగ ప్రతినిధులు దక్షిణ భారతదేశంలో పర్యటించడం మనం ఎన్నిసార్లు చూశాం? రైతు ప్రతినిధులు, భూమిలేని కార్మికులు కలసి ఉద్యమించడం మనం ఇదివరకు ఎన్నిసార్లు చూశాం? చాలా తక్కువ. ఇదే ఈ వారంలో కార్యరూపం దాలుస్తున్నది.



మూడో తరం రైతు ఉద్యమకారులు

దేశ రైతాంగాన్ని ఏకం చేయడానికి జరుగుతున్న ఆ యాత్ర మూడో తరం రైతు ఉద్యమకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రైతుల బలవన్మరణాలను గురించిన వాస్తవికతను ఇవాళ్టి రైతాంగ పోరాటం ఎదుర్కొనవలసి ఉంది. గ్రామీణ భారతంలోని పేదరికమే రైతులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఉపకరించే ఉద్యమాలకు పురిగొల్పుతున్నది. రైతు అనే పదానికి విస్తృతార్థం కల్పించడంతో సమాజంలోని వివిధ వర్గాలు రైతాంగంలోకి వచ్చి చేరాయి. దళితులు, ఆదివాసీలు అలాంటివారే. వీరు ఆది నుంచి సేద్యంతో సంబంధం కలిగినవారే. కానీ ప్రధాన స్రవంతి రైతు ఉద్యమాలలో వీరి జాడ కానరాదు. ఈ సంకుచిత దృష్టి మారడం మొదలైంది. ఈ రెండు వర్గాల సమస్యలపై దృష్టి సారించడానికి కూడా రైతాంగ ఉద్యమాలు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయి. అలాగే మహిళా రైతుల ప్రాధాన్యాన్ని గుర్తించడానికి కూడా ఉద్యమాలు సుముఖంగా ఉన్నాయి.



ఇదంతా గతం కంటే భిన్నమైనదేనా? ఇంతవరకు అందుబాటులోకి వచ్చిన ఆధారాలను బట్టి అంతా సజావుగానే కనిపిస్తున్నదని చెప్పవచ్చు. మహారాష్ట్రలో రైతులంతా కలసి చేసిన ఉమ్మడి ఉద్యమంతో ప్రభుత్వం దిగి వచ్చి రుణ మాఫీకి అంగీకరించింది. రాజస్తాన్‌ రైతాంగం కూడా ఈ మాసంలోనే ఒక చరిత్రాత్మకమైన పోరాటానికి నాంది పలికింది. శికార్‌లో లక్షలాది మంది రైతులు వీధులలోకి వచ్చారు. వీరికి బికనీర్, గంగానగర్‌ రైతులు మద్దతు తెలిపారు. రైతులలో వచ్చిన ఈ ఐక్యతను ప్రభుత్వం పసిగట్టింది. రూ. 50,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసే అంశాన్ని చర్చిం చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఇప్పుడు రాజస్తాన్‌ ప్రభుత్వాలు రైతుల డిమాండ్‌కు మద్దతు తెలిపాయి. తరువాత ఏమిటి? దీనికి మాత్రం సమాధానం దొరకదు. కానీ ఒకటి వాస్తవం– మనమంతా రైతాంగ ఉద్యమంలో ఒక ప్రకంపనం దగ్గర పంటి బిగువున ఉన్నామని కచ్చితంగా చెప్పగలం.

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు

మొబైల్‌ : 98688 88986

Twitter: @_YogendraYadav

యోగేంద్ర యాదవ్‌

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top