రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలంగా వెద్యశాల బదులు ఆసుపత్రి అనే అభాస పదాన్ని మీడియాలో, జనం వ్యవహారంలో కూడా విపరీతంగా వాడుతూ వస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలంగా వెద్యశాల బదులు ఆసుపత్రి అనే అభాస పదాన్ని మీడియాలో, జనం వ్యవహారంలో కూడా విపరీతంగా వాడుతూ వస్తున్నారు. పైగా ఆసుపత్రిని అసలైన తెలుగు పదమైనట్లు చాలా మంది నేటికీ భావిస్తున్నారు. హాస్పిటల్ అనే ఇంగ్లిష్ పదానికి హిందీ వారు తమ భాషలో ‘ఆస్పతాల్’ అని పిలుచుకుంటే దానికి అనుకరణగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రచారంలోనికి తెచ్చిన పదమే ‘ఆసుపత్రి’. తెలుగు ప్రజలు సులువుగా పలుకగలిగిన ‘హాస్పిటల్’ను ఆసుపత్రి అని మార్చవలసిన అవసరం లేదు.
స్వచ్ఛ మైన తెలుగు పదం ‘వైద్యశాల’ ఉండగా ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. ప్రజల మీదరుద్దిన అవకర పదమైన ఆసుపత్రిని మీడియా పరిభాషలోంచి ఇప్పటికైనా పరిహ రించాలి. జనం వాడుకలో, మీడియాలో ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వైద్యశాల, దవాఖాన, హాస్పి టల్ అనేవే సరియైన వాడుక పదాలు. కావాలంటే తెలంగాణలో దవాఖాన, ఆంధ్రప్రదేశ్‌లో వైద్యశాల పేర్లను ఇకనైనా వాడుకలోకి తీసుకొస్తే బాగుంటుంది. రెండు రాష్ట్రాల పాలకులు ఈ విషయమై పునరాలోచించి పాలనాపరంగా దీనిపై తగు నిర్ణయం తీసుకుంటారని, కోరుకుంటున్నాం.
డా॥రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి